- స్వామీ వివేకానంద
- మాయా ప్రపంచము
- Creation
- Games
- optical-illusions
- Education
- Jokes
- Quotations
- Motivational Quotations
- Space
- Cars_Bikes
- పొడుపు కథలు
- సామెతలు
- జనరల్ నాలెడ్జ్
- వేమన పద్యాలు
- సుమతీ శతకము - బద్దెన
- కృష్ణ శతకము - నృసింహకవి
- చాటు పద్యములు
- దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
- నరసింహ శతకము - శేషప్పకవి
- నారాయణ శతకము - బమ్మెర పోతన
- భాస్కర శతకము - మారవి వెంకయ్య
- శ్రీకాళహస్తి శతకము
- శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
పొడుపు కథలు
* అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు?
జ) ఆకాశం, చుక్కలు, సూర్యుడు
* అందరాని వస్త్రంపై అన్నీ వడియాలు
జ) నక్షత్రాలు
* అంద చందాల వాడు రోజుకో ఆకారం చివరికి నిరాకారం లేదా నిండు సున్న
జ) చందమామ
* అక్కడిక్కడబండి, అంతరాలబండి మద్దూరి సంతలో మాయమైన బండి.
జ) సూర్యుడు
* అక్కాచెల్లెలి అనుబంధం - ఇరుగూ పొరుగూ సంబంధం దగ్గర వున్నా చేరువ కాలేరు.
జ) కళ్ళు
* అగ్గి అగ్గీ ఛాయ, అమ్మ కుంకుమ ఛాయ, బొగ్గు బొగ్గు ఛాయ, పోలిఛాయ కందిపప్పు, ఛాయ కాలనెమి ఛాయకడసారి తాతయ్య కణితి ఛాయ?
జ) గురిగింజ
* అబద్ధం అంటే తెలియని అమాయకురాలు
జ) అద్దం
* అబ్బాయి గారి దొడ్లో పెద్ద బొప్పాయి పండు పడితే పరుగెత్త లేక పదిమంది చచ్చారు.
జ) పిడుగు
* అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటి కొచ్చింది తైతక్కలాడింది?
జ) కవ్వం
* అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, చెంబులో నీళ్ళన్నీ చెడతాగుతుంది.
జ) గంధపుచెక్క
* అడవిలో పుట్టాను, నల్లగామారాను, ఇంటికి వచ్చాను ఎర్రగామారాను, కుప్పలోపడ్డాను తెల్లగామారాను.
జ) బొగ్గు
* అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మాఇంటికొచ్చింది మహలక్ష్మిలా వుంది.
జ) గడప
* అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను. వంటినిండా గాయాలు, కడుపునిండా రాగాలు.
జ) మురళి
* అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది?
జ) గజం బద్ద
* అనంతపురంలో తప్పెట కొడితే అంతకు తగులు ఇంతకు తగులు చెరువులో ఉండే చేపకు తగులు బీళ్ళలో మేసే గొడ్డుకు తగులు బాలింతకు తగులు దీని భావమేమి?
జ) మెరుపు
* అన్నకందవు అమ్మ కందుతాయి.
జ) పెదవులు
* అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు.
జ) అద్దం
* అర చేతిలో కుంకుమ అందమైన కుంకుమ బీరాకు కుంకుమ బిగువైన కుంకుమ
జ) గోరింటాకు
* అమ్మ కడుపున పుట్టాను. అంతా సుఖాన ఉన్నాను. నీచే దెబ్బలు తిన్నాను. నిలువున ఎండిపోయాను. నిప్పులు గుండు తొక్కాను. గుప్పెడ బూడిద అయినాను.
జ) పిడక
* అమారా దేశం నుంచి తుమారా పండ్లు తెస్తే కొనే వారే గాని తినేవారు లేరు.
జ) పగడం
* అలాము కొండకు సలాము కొట్టు.
జ) గొడ్డలి
* ఆకాశం పచ్చన నక్షత్రాలు తెల్లన
జ) పచ్చిమిరపకాయలు
* ఆకు పచ్చ హాస్పటల్, తెల్ల కాంపౌండరు నల్ల డాక్టరు నా పేరేమి?
జ) సీతాఫలం
* ఆకులేని చెట్టు అరవై ఆరు కాయలు కాస్తుంది.
జ) నాగమల్లి
* ఆడ గణ గణ ఈడ గణ గణ మద్దెమ్మ గుడి కాడ మరీ గణ గణ
జ) డోలు
* ఆ పక్క చూస్తే ఎర్ర టోపీ ఈ పక్క చుస్తే నల్ల టోపీ నేనెవరు?
జ) గురిగింజ
* ఆ రాజు కూతురు అధిక చక్కని దట గోరంత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది.
జ) వరివెన్ను
* ఆమడదూరం నుంచి అల్లుడొస్తే మంచంకింద ఇద్దరు గోడమూల ఒకరూ దాక్కున్నారు.
జ) చెప్పుల జోడు,చేతికర్ర
* ఇంటివెనుక వెంపలిచెట్టు ఏకాయ కాయమంటే, ఆ కాయ కాస్తుంది.
జ) కుమ్మరిసారె
* ఇంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు.
జ) దీపం
* ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ
జ) ఈతకాయ
* ఇక్కడ నుండి చూస్తే గుండు, గుండును కొడితే పండు, పండును కొడితే పదహారు వొప్పులు
జ) తెల్ల పాయ
* ఇక్కడ నుండి చూస్తే ఇనుముగా నుండు దగ్గరకు పోతే పండుగా నుండు తింటే తీపిగా నుండు
జ) తాటి పండు
* ఈడ ఢమ ఢమ ఆడ ఢమ ఢమ మద్ది రేవుల కాడ మరీ ఢమ ఢమ
జ) ఉరుము
* ఈనదు కట్టదు కడుపు నిండితే ప్రజల కింత ఫలమిచ్చు
జ) చెరువు
* ఈ ప్రపంచంలోని వారందరు నా బిడ్డలే. కాని అమ్మా! అని నన్నెవ్వరూ పిలువరు. ఏమి చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నామీదే.
జ) భూమి
* ఎంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు?
జ) మంగళ సూత్రం
* ఎక్కలేని మానుకు దిక్కులేని కాపు.
జ) మిరపచెట్టు
* ఎండకు ఎండదు వానకు తడవదు అది లేకపోతే జరగదు
జ) రూపాయి బిళ్ళ
* ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ.
జ) అరుగు
* ఎర్ర మేడలో పచ్చ దీపాలు, దీపాలు చూదామని మేడ తలుపు తీసిన కళ్ళ వెంబడి నీరుకారు
జ) పిచ్చిమిరప
* ఎనిమిది చేతుల ఏబ్రాసీ ఎప్పుడు తిరిగే సోబ్రాసి వెన్నున జంజె వ్రెళ్ళాడు తీసిన కొద్ది తెర్లాడు.
జ) రాట్నం
* ఎప్పుడు ఒంటరిగా తిరుగుతాడు అందరికీ వెలుగునిస్తాడు.
జ) సూర్యుడు
* ఏటి నీటిన వెంపలి చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు.
జ) పొగ
* ఒంటి కంటివాడు ప్రాణం లేని వాడు ప్రతి సృష్టి చేస్తాడు.
జ) కెమెరా
* ఒక్క ఉద్యోగిపేరు నాల్గక్షరములు; మొదటి వర్ణము చెరపిన కదన మగును; మూడవది చెరుపగ హస్తమునకు చెల్లు; నట్టి ఉద్యోగి ఎవ్వడో అరచి చెప్పుడు.
జ) కరణం
* ఒహొహొ బాలయ్యా ఒళ్ళంతా ముళ్ళయ్య పరపరకోసేస్తే కడుపంతా తీపయ్య.
జ) పనసకాయ
* తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు!
జ) పనస పండు
* తమ్ముడు కుంటుతూ, కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు.
జ) గడియారములోని ముళ్ళు
* తరచి తరచి చూసినా లోతు తెలియనిది?
జ) ఆడదాని మనసు
* తల కాయ వుంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారముల సింగారము!
జ) బొంగరము
* తల ఉన్నా కళ్ళు లేనిది?
జ) గుండు సూది
* తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు!
జ) ఇంటి కప్పు
* తల్లి కూర్చుండు! పిల్ల పారాడు!
జ) కడవ చెంబు
* తళుకు తళుకు నీటిలో శ్రీరాముడు పుట్టె! ఆ శ్రీరాముని కడుపులో ఒక రాముడు పుట్టె! ఆ రాముని కడుపులో వజ్రము పుట్టె!
జ) బియ్యపు గింజ
* తవ్వని కుంట కురవని నీరు?
జ) నోరు, లాలాజలం
* తాపం గాని తాపం
జ) ప్రతాపం
* తాళము గాని తాళము! ఏమి తాళము?
జ) ఆది తాళము
* తాళి గాని తాళి ఏమి తాళి?
జ) ఎగతాళి
* తీసుకునే వారి చెయ్యి పైన, ఇచ్చేవారి చెయ్యి క్రింద ఇలా ఎప్పుడుంటుంది?
జ) బొట్టు పెట్టుకునేటప్పుడు
* తీస్తే పోతుంది. తెల్లారితే వస్తుంది.
జ) మీసము
* తెల్లటోడు నల్లటోడిని తన్ను!
జ) అగ్గిపెట్టె
* తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం.
జ) పుస్తకం
* తేరు తిరుగుతుంటే, పూలు రాలతాయి.
జ) విసురు రాయి
* తొడిమ లేని పండు! ఆకు లేని పంట!
జ) విబూది పండు,ఉప్పు పంట
* తొడేవారే గాని, పోసేవారే లేరు.
జ) బావి నీరు
* తొమ్మిది రంధ్రముల బొమ్మ! ఘనమైన తోలు బొమ్మ!
జ) మనిషి
* దండ కాని దండ ?
జ) అండదండ, కైదండ
* దానము గాని దానము! ఏమి దానము?
జ) నిదానము, మైదానము
* దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత
జ) ఆముదపు చెట్టు
* దినమంతా నిద్రపోతుంది రాత్రంతా మేలుకుంటుంది?
జ) దీపం
* దుకాణములో కొంటారు. ముందర పెట్టుకొని ఏడుస్తారు.
జ) ఉల్లి గడ్డలు
* దోసెడు నీటిలో దొరసాని జలకాడమాడింది?
జ) వెన్న
* ధనము గాని ధనము ఏమి ధనము?
జ) ఇంధనము, బంధనము
* ధరణిలో పన్నెండు మంది భార్యలు నాకు! ఒక్కో భార్యకు నలుగురు కొడుకులు! మూడువందల అరువది ఐదుమంది మనుమలు!
జ) సంవత్సరము= నెలలు, వారములు, రోజులు
* నట్టింట్లో నలుగురు దొంగలు?
జ) చనుకట్ట
* నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు?
జ) ఆవు
* పచ్చని గుడిలో ఎర్రని రత్నాలు?
జ) దానిమ్మ పండు
* పచ్చని పందిట్లో ఎర్రని పెళ్ళికూతురు?
జ) మిరప పండు
* పచ్చని పందిరిలో, తెల్లని మిద్దె లోపల ఉన్నాడు నల్లని రాజు.
జ) సీతా ఫలపు గింజ
* పచ్చిని పెట్టెలో విచ్చుకోనుంది. తెచ్చుకోపోతేనూ గుచ్చుకుంటుంది.
జ) మొగిలి పువ్వు
* పడుతుందేకానీ పైకి లేవలేదు?
జ) వాన
* పళ్ళు ఉన్నా నోరు లేనిది?
జ) రంపం
* పాలుగాని పాలు ఏమిపాలు?
జ) శాపాలు, లోపాలు
* పిటాపురం చిన్నవాడా పిట్టల వేటగాడా బ్రతికిన పిట్టను కొట్టవద్దు. చచ్చిన పిట్టను తేనూవద్దు. కూరకు లేకుండా రావద్దు. ఏమి కూర.
జ) కోడి గ్రుడ్డు
* పుట్టినా కదలనిది ఏది?
జ) గ్రుడ్డు
* పుట్టెడు శనగలలో ఒకటే రాయి.
జ) చందమామ
* పుట్టేటప్పుడు కొమ్ములుంటాయి గానీ, రాక్షసుడను కాను. పెరిగే కొద్దీ గుండ్రముగా ఔతాను గానీ, గోళమును కాను. ఎప్పుడూ తిరుగుతుంటాను గానీ, గడియారమును కాను. మరి నేనెవరిని?
జ) చందమామ
* పుట్టేటప్పుడు లేనిది, మధ్యలో వచ్చేది, చివరిదాకా వుండేది!
జ) భార్య
* పెంకు మీద పక్షి పేరు చెప్పవే కమలాక్షి
జ) తాబేలు
* పెట్టుకుంటూనే పట్టి చూచుకోవాలి?
జ) కొప్పు
* పైన పటారము! లోన లొటారము!
జ) మేడిపండు
* పై నో పలక క్రిందో పలక పలకల మధ్య మెలికల పాము, పామును పట్టా పగ్గలం లేదు పెగ్గెలు పలికే సిగ్గొదినా
జ) నాలుక
* బంగారు చెంబులో, వెండి గచ్చకాయ?
జ) పనస తొన
* బండి ఎక్కడు, గుఱ్ఱము ఎక్కడు, నడువలేని బాలుడు, ఇంటి ముందర అటు ఇటు తిరుగుతాడు.
జ) రాట్నము
* బడి గాని బడి! ఏమిబడి?
జ) రాబడి, దిగుబడి
* బాటకు బంధం, నల్లపూసల అందం?
జ) చీమల బారు
* బారుగాని బారు! ఏమి బారు?
జ) సాంబారు
* బావిలో చింత పండు?
జ) గుబిలి
* బిందె మీద బిందె అల్లాడే పది పందిళ్ళు?
జ) అరటి గెల
* బిళ్ళ కాని బిళ్ళ, లోకం కోరే బిళ్ళ?
జ) రూపాయిబిళ్ళ, తపాళబిళ్ళ
* బుడగకు బుక్కెడు నెత్తురు?
జ) కుంకుమ
* బుడబుక్కలోడొచ్చి భూమంతా చాటించె! మధ్యాహ్నామునకేమో మాయమాయే!
జ) పేడ నీరు
* బొట్టు కాని బొట్టు ఏమి బొట్టు?
జ) తాళిబొట్టు
* భగవంతుని ప్రతిరూపమును నేను! నన్ను మంగళకరముగా భావిస్తారు. మనిషి మనిషికీ ప్రతిరోజూ ప్రతిపూటా ఉపయోగపడతాను.
జ) అద్దము
* భయం కాని భయం?
జ) అభయం
* భరణి కార్తిలో చల్లినకాయకు చిప్పెడు పంట?
జ) నువ్వుల పంట
* భీముడు బిగతన్నె, అర్జునుడు అగపట్టె?
జ) స్తంబం, దూలం
* భుజం మీద ఉంటాడు దండెం మీద వ్రేలాడతాడు?
జ) కండువ
* భూమి చూసి నిలుచును?
జ) పడవ
* భూమిలో పెరిగిన బుల్లి చెంబు?
జ) కందపిలక
* భోజనం సహింపలేదు, గుంజకదలాడుచున్నావెందుకు?
జ) కూరలేదు
* భూ మాతకు ముద్దు బిడ్డ. ఆకాశపు జున్ను గడ్డ. రాత్రి వేళ రాజరికం. పగలయితే పేదరికం.
జ) చంద్రుడ
* మంచము క్రింద మామా! ఊరికి పోదాము రావా?
జ) చెప్పులు
* మందు కాని మందు?
జ) కామందు
* మనతో వస్తుంది, మనకు చెప్పకుండానే వెళ్తుంది?
జ) నీడ
* మల్లపు గుర్రానికి ఒళ్ళంతా రంధ్రాలు?
జ) జల్లెడ
* మా బావ బజారుకెళ్ళి తొడిమలేని వంకాయ తెచ్చాడు?
జ) కోడి గ్రుడ్డు
* మాతాత ఏటి అవతలికి వెళ్ళి మూడెడ్లను తెచ్చాడు. ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది.
జ) సున్నము, ఆకు, వక్క
* మాతాత బోడి, మీతాత బోడి పెద్దప్పబోడి, శివలింగంబోడి?
జ) మంచం కోళ్ళు
* మానం కాని మానం?
జ) అవమానం, బహుమానం, కొలమానం
* మారు కథ మంకెన్న! నీకు నాకు లంకెన్న!
జ) గొళ్ళెము
* ముక్కు మీద కెక్కు! చెవుల పైన నక్కు! జారిపడిందంటే పుటుక్కు! ఏమిటది?
జ) కండ్లజోడు
* ముక్కులేని పిట్ట ముళ్ళన్నీ ఏరుకు తిన్నది.
జ) పొయ్యి
* ముక్కువున్నా మెడలేనిది?
జ) నది
* 'మొగుడు గాని మొగుడు' ఏ మొగుడు?
జ) అప్పుల మొగుడు
* మొఖం ఉన్నా మెడ లేనిది?
జ) నది
* చక చక పోయేవి రెండు. గట్టెక్కి చూచేవి రెండు అంది పుచ్చుకొనేవి రెండు. ఆలకించేవి రెండు.
జ) కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు.
* చక్కని పాపకు చుక్కల చీర!
జ) ఆకాశము
* చచ్చినోడు సంతకు పోవు!
జ) ఎండు చేప
* చాచుకొని, సావిట్లో పండుకొనే ముసలమ్మ! ముడుచుకొని, మూల నిలబడుతుంది.
జ) చాప
* చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము!
జ) పొట్లకాయ
* చారల పాపడికి దూది కుచ్చు!
జ) ఉడుత
* చింపిరి చింపిరి గుడ్డలు! ముత్యముల వంటి బిడ్డలు!
జ) మొక్కజొన్న
* చీకటి ఇంటిలో జడల దెయ్యము!
జ) ఉట్టి
* చిక్కటి కారడవిలో చక్కని దారి!
జ) పాపిట
* చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా!
జ) అరటి పువ్వు
* చిటారు కొమ్మన మిఠాయి పొట్లము!
జ) తేనె తుట్టె
* చిటుకు లాడి! పటుకు లాడి! గోడ ఎక్కి, దుముకు లాడి!
జ) విస్తరాకు
* చిట్టి పిడతలో మూడు కూరలు!
జ) తాంబూలము
* చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు!
జ) నోటిలోని దంతములు
* చిన్న కాయ! నీ మీదున్న కాయ!
జ) చెమట కాయ
* చిన్నచట్టిలో కమ్మటి కూర!
జ) కిళ్ళీ
* చిన్నపట్నములో చాల గదులు! గదికొక్క సిపాయి! సిపాయికొక్క తుపాకి!
జ) తేనె పట్టు
* చిన్నమిద్దెలో చింతపండు?
జ) గుబిలి
* చిన్నా, పెద్ద భేదము లేదు. "వారు వీరు" అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది?
జ) ఆకలి
* చిలుకని గాని చిలుకను నేను! నేను వస్తున్నా, వెళుతున్నా... అదుగో చిలుక! ఇదుగో చిలుక! అంటారు. చిలక గాని చిలక నైన నేనెవరిని?
జ) స్త్రీ
* చూచే వారే గానీ తీసే వారు లేరు.
జ) ఇంద్ర ధనస్సు
* చూచేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు.
జ) కండ్లు, నోరు
* చూడబోతే చిన్న ముండ! విప్పుతుంటే ఎన్ని చీరలైనా వస్తాయి.
జ) నీరు ఉల్లిపాయ
* చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకూ, తోకకూ, ఒకటే టోపి చెప్పండి. ఇది చెప్పండి.
జ) కలరు
* చెక్కని స్తంభం చేతికందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు చెయ్య సున్నం - తియ్యని బెల్లం
జ) కొబ్బరి
* చెట్టు కొడితే పిట్ట లేచి పోయె!
జ) పేడు
* చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు.
జ) ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల
* చెయ్యని కుండ! పొయ్యని నీరు! వెయ్యని సున్నము! తియ్యగ నుండు!
జ) కొబ్బరికాయ
* జామ చెట్టు క్రింద జానమ్మా ఎంత గుంజినా రాదమ్మా
జ) నీడ
* జల్లు పడగానే, జండా లేస్తుంది.
జ) పుట్ట గొడుగు
* జాజికాయ కొట్లాడుతుంది ఎలక్కాయ విడిపిస్తుంది.
జ) తాళంచెవి
* జాబు గాని జాబు ఏమి జాబు?
జ) పంజాబు
* జింక ఉరకంగా పాలుకారంగా?
జ) విసురు రాయి
* జిత్తెడు తోకున్న జివలగిరి మేక! ఆవుల కొండెక్కి, ఆకు మేసె!
జ) ఎలు
* జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె!
జ) అరటి చెట్టు
* జీవం ఉంది కాని కదలలేదు
జ) గ్రుడ్డు
* జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది?
జ) దువ్వెన
* జీవము లేని గరుడ పక్షి దేశ దేశములూ తిరుగుతుంది.
జ) విమానము
* జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి.
జ) పడవ
* జీడీ వారికి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు మైనులగుల్కె వయ్యారి వైశాఖంలో వస్తుంది.
జ) మామిడి పండు
* జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు!
జ) పావు కోళ్ళు
* యంత్రము గాని యంత్రమును నేను! నాకు అప్పుడపుడు రిపేర్లుంటాయి. ఒక్కసారి ఆగిపోయానంటే, నేను మరలా పనికి రాను. మరి నే నెవరిని?
జ) మనిషి
* యమునికైనా భయపడను! కొట్టినా ఏడవను! తిట్టినా బాధ పడను! మీరేమనుకున్న నేనేమనుకోను. మరి నేనెవరిని?
జ) బొమ్మ
* యేరు మీద మిరప చెట్టు నాకగపడుతుంది, నీకగపడదు.
జ) బొట్టు
* రచ్చబండ క్రింద నలుగురు దొంగలు?
జ) గేదెపొదుగు
* రణం కాని రణం ?
జ) మరణం,తోరణం,ఆభరణం
* రసం కాని రసం?
జ) నీరసం, సరసం, విరసం
* రాజ మందిరము చిన్నదానా! రాఘవయ్య కోడలా! చేద వెయ్యకుండా, తియ్యకుండా, దాహమునకు నీరు తేవె!
జ) కొబ్బరి నీరు
* రాజా వారి తోటలో రోజా పూలు! చూచే వారే గాని, కోసే వారు లేరు. ఏమిటవి?
జ) నక్షత్రములు
* రాయి గాని రాయి! ఏమి రాయి?
జ) పావురాయి
* రేయీ, పగలూ నడిచింది. చేయీ, చేయీ కదిలింది. వేళా, పాళా చెపుతుంది. వున్నచోటనే పడివుంది.
జ) గోడ గడియారము
* రోషమునకు మారు పేరు నేను! భీముడను మాత్రము కాను. అందుకే ఎవరికి రోషము వచ్చినా, ముందు నా మీదే చెయ్యి వేస్తారు. నే నెవరిని?
జ) మీసము
* లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే!
జ) అన్నము ఉడుకుట
* లక్కబుడ్డి నిండా, లక్ష వరహాలు?
జ) పుచ్చకాయ
* లక్కపిడతలో, లక్ష వరహాలు!
జ) దానిమ్మపండు
* లాగి విడిస్తేనే బ్రతుకు?
జ) ఊపిరి
* లింగడు కన్నెమనసు, దొంగిలించిన దొంగాడు?
జ) మన్మధుడు
* లోకమంతా చాప వేసి, నిద్ర పోకుండా తిరుగుతూ వుంటాడు.ఎవరతను?
జ) సముద్రము
* లోతు బావిలో జారికి బెల్లం?
జ) గుబిలి
* లోన బంగారము! బయట వెండి! ఏమిటి?
జ) కోడి గ్రుడ్డు
* వంకర టింకర మ్రాను! కష్ట జీవుల గూడే ఈడు, జోడు! విప్పితే, ఇంకో ఇల్లుంది. ఏమిటది?
జ) పెండ్లి పల్లకి
* వచ్చి పోయేవి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
జ) కలిమి, లేములు - మాన, ప్రాణములు
* 'వరి' గాని వరి! ఏమి వరి?
జ) జనవరి
* వళ్ళంతా ముళ్ళు. వాసన ఘుమఘుమ?
జ) గులాబి
* వస్తూకేక లేస్తుండు! వేస్తూ పోతుండు! ఎవరు?
జ) గాజులసెట్టి
* వస్తే పోనివి రెండు! పోతే రానివి రెండు! ఏమిటి?
జ) కీర్తి, అపకీర్తి - పరువు, ప్రతిష్ట
* వాకిట్లో కలవారి కోడలు పడింది?
జ) ముగ్గు
* వాయు వేగమును మించి, లోకములన్నీగాలించి, చిటెకెలోఉన్న చోటికి వచ్చు! ఏమిటది?
జ) మనసు
* 'వారు' గాని వారు! ఏమి వారు?
జ) నవారు, అయ్యవారు
* 'వాలు' గాని వాలు! ఏమి వాలు?
జ) ఆనవాలు, ఆవాలు
* విత్తనము లేకుండా, మొలిచేది ఏమిటి?
జ) గడ్డము
* విశ్వాసమునకు ప్రతినిధిని నేను! విశ్వాసహీనుని చూచి, ' నీకంటే అదే నయమని' అంటారు. మరి నేనెవరిని?
జ) కుక్క
* వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము!
జ) అగ్గి పెట్టెలోని పుల్లలు
* వేసిన దేమిరా? వ్రేలు పెట్టి చూసిన దేమిరా?
జ) వేసినది చెక్కరా! వ్రేలుపెట్టి వాసన చూచినది శ్రీ గంధమురా
* వేస్తే సోకు! తీస్తే బోసి! ఏమిటి?
జ) కండువ
* శంఖులో పెంకు, పెంకులోతీర్థము, తీర్థములో మొగ్గ?
జ) టెంకాయ
* శాఖలు ఉన్నా, ఆకులు లేనిది?
జ) సంస్థ
* శిబి, కర్ణులార్జించిన చెలువ ఏది?
జ) కీర్తి
* శివరాత్రికి చంకలెత్తనీయుడు?
జ) చలి
* శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?
జ) మామిడికాయ
* శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, 'కుక్కకు, నక్కకు పెళ్ళి'అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా?
జ) ఇంద్ర ధనస్సు
* శ్రీ రాముల ఇంటి వెనుక శ్రీవణము చెట్టు! కాస్తుంది, పూస్తుంది. వాసన వుండదు.
జ) చింతకాయ
* శ్రీ విష్ణువు మోయుచు తిరిగెడు పక్షి?
జ) గరుడ పక్షి
* సంతలో షావుకారు, ఊరిలో ఉద్యోగరాయుడు, గట్టుమీద గంగారాయుడు!
జ) త్రాసు, కలము, కొంగ
* సందకాడ లగ్గమాయె! కాని పొత్తు గర్భమాయె! కోడి కూతకు కొడుకు పుట్టె! పొద్దు పొడవ పేరు కొచ్చె!
జ) చల్లకుండ
* సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి ఊళ్ళోకొచ్చి అరిచేది?
జ) శంఖం
* సముద్రంలో మునుగునది కానీ, చేపకాదు ఏమిటది?
జ) నది
* సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు.
జ) అరిసెలు
* సాయి గాని సాయి! ఏమి సాయి?
జ) కసాయి
* సార సారల చెంబు, చక్కని చెంబు ముంచితే మునగదు ముత్యాల చెంబు?
జ) దోసకాయ
* సావిట్లో సద్దు కర్ర ?
జ) కలం
* సీమంత ముండ బిడ్డ అందరికీ వడ్డించు!
జ) గరిటె
* సువాసన ఉన్నా, పూజకు పనికి రానిది.
జ) మొగలి పూవు
* సూది వెళ్ళి చుక్కలను తాకింది. ఏమిటి?
జ) తారాజువ్వ
* సూర్యుడు చూడని మడుగు! చాకలి తాకని గంగ!
జ) టెంకాయ
* హంస ముక్కుకి, ముత్యం కట్టుకొని తోకతో నీళ్ళు త్రాగుతుంది?
జ) ప్రమిద
* హద్దులేని పద్దు?
జ) అబద్దం
* హనుమంతుడు అందగాడు?
జ) బ్రహ్మచారి
* హనుమంతుని పెళ్ళాం గొప్పధనవంతురాలు, తట్టెడు సొమ్ములు పెట్టుకొని తలవాల్చు?
జ) కొర్రకంకి
* హరీ అనకుండానే చచ్చేది?
జ) చెట్టు
* హర్మోనియంకూ, నాకూ తేడా ఉండదు. అది శబ్దము చేస్తుంది. నేనునూ శబ్దము చేస్తాను. దాని ఫలితము అశాశ్వతము! నా ఫలితము శాశ్వతము! మరి నేనెవరిని?
జ) టైప్ రైటర్
* హారము గాని హారము! ఏమి హారము?
జ) ఆహారము