- స్వామీ వివేకానంద
- మాయా ప్రపంచము
- Creation
- Games
- optical-illusions
- Education
- Jokes
- Quotations
- Motivational Quotations
- Space
- Cars_Bikes
- పొడుపు కథలు
- సామెతలు
- జనరల్ నాలెడ్జ్
- వేమన పద్యాలు
- సుమతీ శతకము - బద్దెన
- కృష్ణ శతకము - నృసింహకవి
- చాటు పద్యములు
- దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)
- నరసింహ శతకము - శేషప్పకవి
- నారాయణ శతకము - బమ్మెర పోతన
- భాస్కర శతకము - మారవి వెంకయ్య
- శ్రీకాళహస్తి శతకము
- శ్రీకాళహస్తీశ్వర శతకము - ధూర్జటి
చాటు పద్యములు
* అసలైన కాంతయైతే
కుశలాదుల నడిగి నిన్ను కూర్చోమనదా
కసవూడ్చు లక్ష్మికాంతికి
రసికత్వంబేమి తెలుసు రంగా వినరా
* అత్తుగ దూరుపు బడమర
చిత్తరువు లిఖించి నిదుర జెందితి నౌరా
చిత్తరువు వ్రాయ బోవలె
నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్
* అన్నాతి గూడి హరుడవు
అన్నాతిని గూడకున్న అసుర గురుడౌ
అన్నా తిరుమల రాయా
కన్నొక్కటి కలదుకాని కౌరవ పతివే
* అల్ల సాని వాని యల్లిక జిగి బిగి
ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు
పాండు రంగ విభుని పద గుంఫ నంబును
కాక మానిరాయ ! నీకె తగుర
ఆ (1)
* ఆంద్ర భాష యమృత మాంద్రాక్షరంబులు
మురువు లొలుకు గుండ్ర ముత్తియములు
ఆంద్ర దేశ మాయురారోగ్య వర్ధకం
బాంద్ర జాతి నీతి ననుసరించు.
ఇ (3)
* ఇంటికి పదిలము బీగము
వింటికి పదిలంబు నారి,వివరింపంగా
చంటికి పదిలము రవికెయు
కంటికి పదిలంబు కుందవరపు కవి చౌడప్పా !
* ఇయ్యగ ఇప్పింపం గల
అయ్యలకే కాని మీస మందరికే లా?
రొయ్యకు లేదా బారెడి
కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా !
* ఇలలో నిద్దరు రాజులు
మలయచుఁజదరంగ మాడి మాపటి వేళన్
బలమెత్తి కట్ట మరచిన
నెలుకలు తమ కలుగులోన కేనుగు నీడ్చెన్
ఈ (1)
* ఈగల్వోలె వ్రణంబులే వెదకుచున్నీర్ష్యం బరున్మెచ్చకే
మూగల్వోలె నిరంతరాస్యు లగుచున్ మూర్ఖించి తర్కించినన్
వీగన్నేరని దుష్కవుల్ బ్రతుకనీ విక్రాంతులై వారినో
రాగంబోవగ నేల సత్కవులు సూర్యా ! పద్మినీ వల్లభా !
ఉ (1)
* ఉన్నామని సంతోషము
సున్నా ఇక చావు మటుకు సుఖమా అంటే
అన్నీ సందేహాలే మరి
విన్నావా ముళ్ళ పూడి వెంకట రమణా
ఊ (2)
* " ఊరెయ్యది" " చీపురు పలి "
" పెరో " " సూర కవి " " ఇంటి పే ?" " రడిదము వార్ "
" మీ రాజు ?" " విజయ రామ మ
హారా " " జతడేమి సరసుడా ?" భోజుడయా ?
* ఊరు వ్యాఘ్ర నగర మురగంబు కరణంబు
కాపు కవి వరుండు కసవు నేడు.
గుంపుగాగ నిచట గురజాల సీమలో
నోగులెల్ల గూడి రొక్క చోట
శ్రీ నాధుడు
ఋ (0)
ౠ (0)
ఎ (2)
* ఎడవల్లి సూర నారయ
చెడ దొబ్బెను నలును పార్టు ఛీ ! ఏముండా
కొడుకిచ్చె వీనికింబలి
చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరముల్
అబ్బూరి రామ కృష్ణా రావు గారు
* ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూర కుండుము
చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ
శ్రీ శ్రీ
ఏ (3)
* ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము స
న్మానము లందినాము,బహుమానములన్ గ్రహియించినార మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర
జ్ఞానిధులంచు బేరుగొనినారము నీవలనన్ సరస్వతీ !
* ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసి రో
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీము తల్లియున్
కాముని కన్న తల్లియును కంజదళాక్షు ననుంగు తల్లియున్
శ్రీ మహిత ప్రతాపుడగు సిద్దయ తిక్కన గన్న తల్లియున్
వేములవాడ భీమ కవి
* ఏమేమో శాస్త్రంబులు
తామెక్కిలి సతికె నంట తద్దయు కవితా
సామర్ధ్యమెరుగ నేరని
సోముని జృంభణము కలదె సూరుని ఎదుటన్
ఐ (0)
ఒ (3)
* ఒకని కవిత్వమం దెనయు నొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పుబట్ట పనియుండదు కాదని తప్పు బట్టినన్
మొక మటు క్రిందుగా దిగిచి మ్రుక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్
* ఒక్కడు మాంసమిచ్చె మఱి యొక్కడు చర్మము గోసి ఇచ్చె వే
ఱొక్కరుడస్థి నిచ్చె నిక నొక్కడు ప్రాణము లిచ్చె వీరిలో
నొక్కొక పట్టీనన్ బ్రతుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ ! రాయన మంత్రి భాస్కరా !
* ఒడలి నిండ కన్నులుండు నింద్రుడు కాడు
కంఠమందు నలుపు !కాడు శివుడు !
ఫణుల బట్టి చంపు పక్షీంద్రు డా కాదు
దీని భావ మేమి తెలిసి కొనుడు
ఇది పద్య రూపములో నున్న పొడుపు కధ జవాబు = నెమలి
ఓ (0)
ఔ (0)
అం (2)
* అందముగా కవితల్లెడు
చందము కావలయుగాని ఛందమదేలా
విందుకు రుచికద అందము
ఎందుకు విస్తరి వివరములెంచుట సుమ్మా?
ఈ ప్రశ్నకు సమాధానం " స " లో చూడండి
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
* అంగడి యూరలేదు వరియన్నము లేదు శుచిత్వమేమి లే
దంగన లింపులేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగ పడంగ బాల్పడుక-పాపరులెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన పలనాటికి మాటికి బోవనేటికిన్
అః (0)
క (5)
* కొండగుయండవీవనుచు కొండలరాయుని దండి మన్మడా
దండముబెట్టినీకు బహుదండిగపెట్టిన మోదకమ్ములన్
నిండుగ రెండుహస్తముల నింపితినన్న నెపమ్మువీడి నీ
తొండమునెత్తియేని మదితోచిన దీవెనలిమ్ము దేవరా
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
* కవులు పొగడువేళ, కాంతలు రతివేళ,
సుతులు ముద్దువేళ, శూరవరులు
రణము సేయువేళ, " రా" కొట్టి పిలుతురు
పాడి యదియు మిగుల భణితికెక్కు
* కుప్పలు కావలి గాయగ
చెప్పులు కఱ్ఱయును బూని శీఘ్ర గతిం దాఁ
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణి వరుండు గడ గడ వణికెన్ !
* కృష్ణ వేణమ్మ గొని పోయె నింత ఫలము
బిల బిలాక్షులు దినిపోయె దిలలు పెసలు
బొడ్డు పల్లెను గొడ్డేరి మోస పోతి
నెట్లు చెల్లింతు సుంకంబు లేడు నూర్లు ?
* కృష్ణ శాస్త్రి కృతులు కీర్తనలా కావు
పదము లనుట కసలె పనికి రావు.
నేటి చెవులకింపు నింపెడు రాతులతొ
కూర్చి నట్టి మధుర కూజితములు
ఖ (1)
* ఖగపతి అమృతము తేగా
బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగమొక్కై జన్మించెను
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
గ (7)
* గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడగితినా పఠీలు మని తూలి పడన్ కులశైల రాజముల్
విడువకనుగ్రహించి నిరు పేద ధనాధిపు తుల్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే
* గరళము మ్రింగితి ననుచుం
బురహర గర్వింప బోకు పో పో పోనీ
బిరుదింక గాన వచ్చెడి
మెరిసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ
* గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళం జెరువు తెగును వనమును ఖిలమౌ
చెడనిది పద్యంబొకటియె
కుడి యెడమల గీర్తి గన్న గువ్వల చెన్నా !
* గుడి మీది క్రోతి తోడను
గుడి లోపలి నంబి వారి కోడలి తోడన్
నడి వీధి లంజ తోడను
నడి గొప్పుల హోరు గాలి నడిగితి ననుమీ !
* గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకు మంచు ఈ
త్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్క మారు ఈ
అప్పములన్ని కప్పలయి అన్నము సున్నము గాగ మారు చున్
పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరు రాలు కావుతన్
వేములవాడ భీమ కవి
* గొప్పైన నిమ్మపండ్లును
కప్పురమును,సొంఠి పొడియు,కరివేపాకున్
ఉప్పును, ఏలకు, లింగువ
నొప్పుగ నీ చల్ల రుచికి నొనగూర్పదగున్
* గోకి గోకి మావ్రేళ్ళు గోళ్ళు పోయె
జేబులన్నియు వరుసగా చినిగిపోయె
తెగబరుకుచుంట, నిద్దుర యెగిరిపోయె
నాదు నేడు చదువు చంకనాకిపోయె
గాడేపల్లి కుక్కుటేశ్వర రావు
ఘ (2)
* ఘన రోగంబుల బలమా
కను గొనగా జన్నమాంబ కర్మపు ఫలమా
నిను ప్రార్ధించెద వినుమా
మును కొని ఓ గండ మాల ములగకు జనుమా !
* ఘనుడన్ వేముల వాడ వంశజుడ దాక్షారామ భీమేశ నం
దనుడన్ దివ్య విషామృత ప్రకట నానా కావ్యధుర్యుండ ,భీ
మన నా పేరు వినంగ జెప్పితి తెలుంగాధీశ ! కస్తూరికా
ఘనసారాది సుగంధ వస్తువులు వేగంబిచ్చి లాలింపురా !
ఙ (0)
చ (8)
* చిన్న చిన్న రాళ్ళు, చిల్లరదేముళ్ళు
నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు,
సజ్జ, జొన్న కూళ్ళు. సర్పంబులును తేళ్ళు
పల్లనాటిసీమ పల్లెటూళ్ళు
శ్రీనాధ కవిరాజు
* చెప్పితి వప్పాజీ కధ
నెప్పటికప్పుడుయె గొప్ప లెప్పుగ నొప్పన్
చెప్పగ నీకీవే సరి
ఒప్పుమ నాజోతలీవు ఒప్పులకుప్పా
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ. ఈ పద్యం వివరణ క్రింద ఉంది.
* చచ్చి పోయి జీవి ఎచ్చటి కేగునో
ఏమి యగునొ ఎవరి కెరుగ రాదు
ఎరుక లేని వార లేమేమొ చెప్పగా
విని తపించు వారు వేన వేలు
అబ్బూరి రామ కృష్ణా రావు గారు
* చదువ దెంత యున్న సంస్కార మింతగ
నెరుగ కున్ననదియు చదువు గాదు
పరిమళమ్ము లేక పసలేదు పూలకు
వినుర శ్రీనివాస ! విబుధ సూక్తి. ! #ట్లె
* చదువుల్ సాములు, శాస్త్రచర్చ, ధరణీరాజ్ఞీత్వ, శిల్పంబులున్
కదనంబందనురక్తి, గాన, కవితా,విజ్ఞాన సారధ్యమున్
సుధలంజిమ్మెడి పాకశాస్త్ర విధియంచున్ బాల లాలిత్యమున్
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్
* చప్పటి దుంపలు తినుచును
తిప్పలు పడు చుంటిమయ్య దేవా దయతో
గొప్పగు మార్గంబొక్కటి
చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్చన్
* చాకివానితోడ జగడాలు పడలేక
సిరిగలాడు పట్టుచీరె గట్టె
శివుడు తోలుగప్పె చీయని మదిరోసి
భైరవుండు చీర పారవైచె
* చీపర బాపర తీగల
చేపల బుట్టల్లినట్టు చెప్పెడి నీ యీ
కాపు కవిత్వపు కూతలు
బాపన కవివరుని చెవికి ప్రమదంబిడునే !
తెనాలి రామకృష్ణ
ఛ (0)
జ (2)
* జిలుగు రతనాల పేట పూచెండు లాట
క్రొంజవుల ఊట అమృతంపు కొలను మోట
వలపు ముద్దుల మూట పువ్విలుతు వేట
హాయి నొడ ఫోయు తేట రాజాయి పాట.
* జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలెతప్పన్
సన్నన్నము సున్న సుమ్మీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరికిన్
ఝ (0)
ఞ (0)
ట (0)
ఠ (0)
డ (0)
ఢ (0)
ణ (0)
త (5)
* తల్లికి దాస్యమున్ జెరుప తారల సీమను మీరి సూటిగా
వెళ్ళెనదేలనో సురల వీధికి వీరుడు వైనతాత్మజుం
డల్లన బడయతానమృతము ఆగడమేలను ఆంధ్రులింటి వం
టెల్లయు కాదొకో అమృతమెట్టుల ఆనుడి విస్మరించెనో
శ్రీఅదిభట్ల కామేశ్వర శర్మ
* తెలియనివన్ని తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్
పలుకగ కాదు రోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ
పలికిన నోట దుమ్మువడ భావ్యమెరుంగక పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !
* తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులుగొల్వ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
సాహితీ సమరాంగణ చక్రవర్తి. శ్రీకృష్ణదేవరాయలు
* తెలుగుం గబ్బపు రీతులు
కల నెరుగని శుష్క తర్క కర్కశ మతికిన్
తెలిసి నొక యించు కించుక
వెలి పలి గౌతన్న కృప కవిత్వపు జాడల్
* తేటతెనుంగుమాట, అది తీపిదనాన వరాలమూట క
ర్ణాటక ఆంధ్రరాజ పరిరక్షిత శోభిత ప్రౌఢమూర్తియై
నాటికి నేటికిన్ వసుధ నాణ్యతగాంచెను కీర్తినొందె, యి
ప్పాటున పల్కెదన్ తెలుగువాడను నేనని దర్పమొప్పగన్
థ (0)
ద (3)
* దారెరుగని వాడును గో
దారిన తానొక్కమారు తడవని వాడును
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి
* దేవునాన మున్ను దేశాని కొక కవి
యిప్పుడూర నూర నింట నింట
నేవురార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగు రేసి కవులు పద్మనాభా !
* దోస మటంచెఱింగియును దుందుడు కొప్పఁగఁబెంచి నార మీ
మీసము రెండు భాషలకు మేమె కవీంద్రుల మంచుఁదెల్పఁగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుఁడు గెల్చి రేని యీ
మీసము దీసి మీ పద సమీపము లందలలుంచి మ్రొక్కమే
ధ (1)
* ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయము లెల్ల వంది గణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణి యై విరించి కొడుకై శ్రీ గంగ సత్పుత్రి యై
వరసన్నీ ఘన రాజ సంబు నిజమై వర్ద్ధిల్లు నారాయణా
న (4)
* నరసింహ కృష్ణరాయల
కరమరదగు కీర్తి వెలయు కరిబిత్ గిరిబిత్
కరి కరిబిత్ గిరి గిరిబిత్
కరిబిత్ గిరిబిత్తురంగ కమనీయంబై
తెనాలి రామకృష్ణుడు
* నక్కలు బొక్కలు వెదకును
నక్కర తో నూర పంది యగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదకును
దక్కడి నా లంజె కొడుకు తప్పే వెదకున్
* నిరుపహతి స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజనముయ్యల మంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక కృతుల్రచియింపుమటన్న శక్యమే ?
* నెమలిపురి యమపురాయెను
యముడాయెను బసివిరెడ్డి, యెటుజూచినయున్
యమధూతలైరి కాపులు
క్రమమెరుగని దున్నలైరి కరణాలెల్లన్
ప (10)
* పంచ దార కంటె పర దార తీయన
రాజు కంటె మోజు రంకు మగడు
ఐన దాని కంటె కానిది మేలయా
విశ్వదాభి రామ వినుర వేమ !
దేవుల పల్లి కృష్ణ శాస్త్రి
* పక్షి వర్యుండు బరగు పంచాక్షరముల
వాని తలదీయ క్షుద్ర దేవత జనించు
వాని తలదీయ తక్కెడ జానుమీరు
దాని ప్రధమాక్షరము దీయ దనరు నృపతి
* పగరకు వెన్నిచ్చిన చో
నగరే నిను మగతనంపు నాయకు లెందున్
ముగురాడు వార మైతిమి
వగ పేటికి జలకమాడ వచ్చిన చోటన్
* పదము లారు కలవు బంభరంబా, కాదు
తొండముండుఁగాని దోమ కాదు
రెక్కలుండుఁగాని పక్షి గా నేరదు,
దీని భావ మేమి తెలిసి కొనుడు.
ఇది పద్య రూపము లోనున్న పొడుపు కధ " జవాబు = ఈగ
* పర గడుపు న సభ లోపల
తరుణుల యెడ భుక్త మైన తరి యొక విడెమున్
దొరకని నరునకు సౌఖ్యము
కురు వప్పా కుందవరపు కవి చౌడప్పా
* పర్వత శ్రేష్ఠ పుత్రికా పతి విరోధి
యన్నపెండ్లాము అత్తనుగన్న తండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ
సున్నమించుకతేగదే సుందరాంగి.
* పున్నమి జాబిలి మోమని
అన్నులమిన్నులను పోల్చు టనుచిత మట నే
డన్నీ రాళ్ళూ రప్పలె
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా !
* పూజారి వారి కోడలు
తాజారగ బిందెజారి దబ్బున బడియెన్
బేజారై కొంగుదడసిన
బాజారే తొంగిజూసి ఫక్కున నవ్వెన్
* పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయనట్టి భూపతి బ్రతుకున్
మగ డొల్లని సతి బ్రతుకును
వెగటు సుమీ పొణుగు పాటి వేంకట మంత్రీ
* పొగలనూది రైలు మిగుల దూరముజేర్చు
నావ పొగలనూది రేవుజేర్చు
రైలు నావ చొరని కాలుప్రోలికి వేగ
మీరు ఊదు పొగయె మిమ్ము జేర్చు
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
ఫ (1)
* ఫుల్లసరోజనేత్ర అల పూతనచన్నుల చేదుద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితినటంచును నిక్కెదవేమొ తింత్రిణీ
పల్లవయుక్తమై యుడుకు బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లగ నొక్కముద్ద దిగమ్రింగుము నీపస కానడయ్యెడిన్
శ్రీనాధ కవిరాజు
బ (3)
* బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
కూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూలి కౌ
ద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్ధమై.
ఇది చాటుపద్యమో కాదో ఇదమిద్ధంగా చెప్పడం కష్టం. కాదు అని కొందరూ ఎందుకు కాకూడదూ అని ఇంకొందరూ వాదులాడుకోవడం జరిగింది(ట).నాకు అవుననిపించింది అందుకు వేసేసేను.
* బూతులు పలికెడు నోటికి
నీతులు అందమ్మునీయ నేరవు, మెసవన్
గోతులు వెదకెడు నక్కలు
వాతలు మైదాల్చినంత వ్యాఘ్రములగునే
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
* బచ్చుండవు నెర దాతల
మ్రుచ్చుండవు శత్రువులకు మహిత జ్వాలా
చిచ్చుండవు కవి వర్యుల
మెచ్చుండవు మేటి సుగుణ పుట్టీ ! సెట్టీ !
పానుగంటి లక్ష్మీ నరసింహా రావు గారు
భ (1)
* భానుని మ్రింమిగిన పగిదిని
సేనాధిపు నాక్ర మించి చీకాకు పడం
గా నొనరిచి రానీయకు
సేనల నో శత్రు హంత !శ్రీ హనుమంత !
మ (7)
* ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగా
నొద్దిక నాకొసంగుడని యొక్కరు గోరగ లేరు లేరోకో??
పెద్దనపోలు పండితులు పృధ్విని లేరని నీవెరుంగవే
పెద్దన కీదలంచినను పేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా
* ఈ పద్యం చూసినప్పుడల్లా నాకు సంతోషం కలుగుతుంది. కారణం తెలుగు భాష గొప్పతనాన్నీ కంద పద్యం అందాన్నీ ఆకళింపు చేసుకున్న ఒక ముస్లిం మహనీయుడు వ్రాసిన పద్యం ఇది. మనస్పూర్తిగా ఆతని పాదాలకు సలాం. ఆతని పేరు అజ్మతుల్లా సయ్యద్ అలీ
మాకీ జూస్తే నగ్తర్
మీకీ తలిదండ్రి లేవె? మీకీ నే, తు
ప్పాకీ తీస్కొని కొడ్తే
మాకీ పాపంబి లేదె, మాదర్ చోదుల్
* మాటలు పస నియ్యెగికి
కోటలు పస దొరలకెల్ల ఘోటకములకున్
దాటులు పస బెబ్బులులకు
కాటులు పస కుందవరపు కవి చౌడప్పా !
* ముక్కోటి దేవు లందురు
మ్రొక్కగ తా జింహ్వ లేప సృష్టించెనయా
చక్కనిది ఆవకాయన
ముక్క తినని వాడు కొండ ముచ్చై పుట్టున్
* మెత్తనై యున్న యరటాకు మీదఁగాక
మంటమీఁదనుఁజెల్లునే ముంటి వాడి
బీదలై యున్న మా బోంట్ల మీదఁగాక
కలదె క్రొవ్వాడి బాదుల్లా ఖాను మీఁద
* మెల్లని పదముల నిడుచును
కల్లగ మా యిల్లు జొచ్చి కలకాలము గా
చల్లన్ని తాగి పోతివి
పిల్లీ ! నీ తల్లి కడుపు భిన్నము గానూ !
* మేతగిరి పిల్ల, పోరున మేకపిల్ల
పారుబోతు తనంబున పందిపిల్ల
ఎల్ల పనులను జెరుపంగ బిల్లిపిల్ల
అందమున కోతిపిల్ల యీ అరవపిల్ల
శ్రీనాధ కవిరాజు
య (0)
ర (7)
* రంజన చెడి పాండవు లరి
భంజనులై విరటు గొల్వఁబాల్ పడి రకటా !
సంజయ ! ఏమని చెప్పుదుఁ
గుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
* రసికుడు పోవడు పలనా
డెసగంగా రంభయైన నేకులె వడకున్
వసుధేశుడైన దున్నును
కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్
శ్రీనాథుని చాటుపద్యం - పల్నాటిసీమకు వెళ్ళినప్పుడు.
* రాజు కళంక మూర్తి,రతి రాజు శరీర విహీను,డంబి కా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమ వర్తి,వి
బ్రాజిత పూస పాడ్విజయ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరా తలంబునన్
* రాయప్రోలు కైత రమణీయమగు కూత
పిదప కవుల పాలి నుదుటి వ్రాత
తెలుగు తోట మీద దిద్దిన పై పూత
పరుల చేత పలుకు బడుల చేత
* రెండిచ్చితి రెండిచ్చితి
మెండిచ్చితి పొండటంచు మేలం బేలా
కండూయ మాన దేహా
మండూకము వంటి కంఠ ! మరి మరి శుంఠా !
* రెండు కాకులు కూర్చుండె బండ మీద
ఒండెగిరి పోయె, అంత అందొండు మిగిలె
రెండవది పోయె, పిదప అందొండు లేదు
బండ మాత్రము పాపమందుండి పోయె !
* సినీ నటుడు రాజేంద్ర ప్రసాదును కలిసినప్పుడు ఆతనిపై చెప్పిన పద్యం
రాజట, హావభావముల రాజట, తారలసీమకెల్ల రా
రాజట, హాస్య లాస్యముల రాజట, వెల్ల తెరంటివెల్గు రే
రాజట, రాజనామ సురరాజట ఈ నటనావినోదియే
రాజట యెల్లయుల్లములు రంజిల చేసెడు చిత్రసీమకున్
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
ల (2)
* లక్షల తరబడి ఆవలి
పక్షంబున గుఱ్ఱములును బలములు వచ్చెన్
ఈ క్షణమున నీవే చని
శిక్షింపుము శత్రు హంత ! శ్రీ హనుమంతా!
* లచ్చిమితోడ బుట్టినను లచ్చలతారక లిచ్చగించినన్
బిచ్చపుజోగియా హరుడు ప్రీతిశిరమ్మున దాల్చి మెచ్చినన్
పచ్చలవింటిరేడు నిను ప్రాణ సఖుండని గారవించినన్
మచ్చను బాపనైరి, గురుమానము ముచ్చిలిసేయ, మోమునన్
స్వీయం
వ (13)
* వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భార్యా మణియున్
శంకరునివంటి దైవము
లంకాపతి వైరివంటి రాజున్ గలరే
* వంగ తోట నుండు వరి మళ్ళ లో నుండు
జొన్న చేల నుండు చోద్యముగను
తలుపు మూలనుండు తల మీద నుండును
దీని భావ మేమి తిరుమలేశ !
* వండగ నెండిన దొక్కటి
వండక మరి పచ్చి దొకటి వడి కాలినదిన్
తిండికి రుచి యై యుండును
ఖండితముగ దీని తెల్పు కవియుం గలడే
వండినది=కాచు .వండక పచ్చిది= తమలపాకు.కాలినది=సున్నము.మూడూ కలిపి కట్టినది=విడియము [ కిళ్ళీ ]
* వండెడి వాని సత్కవిని వైద్యుని మంత్రిని మంత్ర వాదినిన్
కొండెము జెప్పు వాని రిపు గూడిన వాని ధనేశునిన్ ధరా
మండల మేలు వాని దన మర్మ మెరింగిన వాని తో వెసన్
ఖండిత మండిన న్మిగుల గండమె వచ్చు నదెంత వారికిన్ .
* వడిసెల చేత బట్టుకుని వావిరి చక్కని పైట జార గా
నడుము వడంక గా బిరుదు నాట్యము సేయగ గొప్పు వీడ గా
దుడ దుడ మంచె యెక్కె నొక దొడ్డ మిటారపు గమ్మ కూతురున్
దొడ దొడ మంచ మెక్కె నొక దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్
శ్రీ నాధుడు
* వాకిటి కావలి తిమ్మా
ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా !
నీ కిదె పద్యము కొమ్మా
నా కీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !
* వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగ జాతికి
కానలు పస కుందవరపు కవి చౌడప్పా!
* వారిజాక్షు లందు వైవాహికము లందు
ప్రాణ విత్త మాన భంగమందు.
చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు
బొంక వచ్చు నఘము పొందడధిప !
* వాసము విడి వారాశిని
కోసులు కోసులుగ మీరి కుదురుగనున్నన్
వేసములేవిధి వేసిన
భాషకు మధురాల తెల్గు పలికెదనన్నా
తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తూ
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
* విధిసంకల్పముచే నొకానొకడు తా విశ్వంబుఁ బాలించుచో
బధిరంబెక్కువ, చూపు తక్కువ, సదా భాషల్ దురుక్తుల్ మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతల్ చెందు; న
య్యధికారాంతమునందుఁ జూడవలెరా యా యయ్య సౌభాగ్యముల్
చాటుపద్య రత్నాకరము
పిస్క సత్యనారాయణ
* వెల్లతెరవెల్గు ఒల్లనల్ మల్లడింప
ఉల్లలనమొంది ఉల్లమ్ములుల్లసిల్ల
సల్లపనమల్లి తానెల్ల ఉల్లములను
కొల్లగొన్నట్టివాడు ఈ గొల్లపూడి
స్వీయం
* వేద విద్య నాటి వెలుగెల్ల నశియించె
గారె బూరె పప్పు చారు మిగిలె
బుర్ర కరిగి బొర్ర గా మారెరా
విశ్వ దాభి రామ వినుర వేమ
దేవుల పల్లి
* వేయారు వగల కూరలు
కాయ లనేకములు ధాత్రి కలవందులలో
నాయకములు రా కాకర
కాయలు మరి కుందరవరపు కవి చౌడప్పా
శ (6)
* శతపత్రంబుల మిత్రుని
సుత జంపినవాని బావ, సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరివైరి సున్నంబిదిగో
* శరనిధి మేర దప్పినను శంకరుడిచ్చు వరంబు దప్పినన్
సుర గురు నీతి దప్పినను సూర్యుడు చంద్రుడు త్రోవ దప్పినన్
వరుస తనాన రాఘవుని బాణము దప్పిన హాస్య కాండ్ర లో
సరసుడు జాణ కుందవర చౌడుని పద్యము నీతి తప్పునే
* శాపానుగ్రహ పటువును
రాపాడెడి కవుల నెత్తి రంపంబనగా
భూపాల సభల బూజ్యుడు
నా పేరే భీముడండ్రు నరవర వినుమా !
* శిలలలోన కల్గు జీవుని తెలియక
వాని నిశ్చలతయు వాని పరత
తెలియకిట్లు ప్రేలు తెలివియౌ నటెనీకు
వినయ మెపుడు గల్గు వెర్రి వేమ
* శివుడద్రిని శయనించుట
రవి, చంద్రులు మింటనుంట, రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట, నల్లి బాధ పడలేక సుమీ
* శ్రేష్టి శ్రేష్టి యనుచును
శ్రేష్టము గా పల్కి నాము చెలువుగ లలితో
మేష్టరు వగదువు సెట్లకు
సుస్ఠు గ శ్రీ సుబ్బి గుప్త సుకవుల తృప్తా
పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు
ష (0)
స (5)
* సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తగపెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా??!!
పరమేశా, గంగవిడుము పార్వతిచాలున్
* సుందరంగు కవనమ్ముకు
ఛందము అందము అనుటకు సందియమేలా
సుందరివేసెడు చిందులు
అందెల సందడియెలేక అందంబగునే
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ
* సుకృతాత్ములు రససిద్ధులు
సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయా
ధిక కీర్తి శరీరంబులు
ప్రకట జరా మరణ జన్మ భయ రహితంబుల్
* సొగసుకీల్జడదాన సోగ కన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన
బంగారు జిగిదాన *శింగారములదాన
నయమైన వొయ్యారి నడలదాన
తోరంపు కటిదాన **తొణకు సిగ్గులదాన
పిడికిటనడగు నెన్నడుముదాన
తళుకు చెక్కుల దాన బెళుకు ముక్కెర దాన
సింగాణి కనుబొమ చెలువుదాన
మేలిమిపసండి రవకడియాలదాన
మించిపోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడవె ముత్యాల వరుసదాన
చేరి మాటాడు చెంగావి చీరెదాన
ఈ పద్యం శ్రీనాధ విరచితమని అందురు, కొందరు కాదనీ అందురు.
* సౌరతర ప్రభంధము లసంఖ్యము గా నొన రించు నట్టి ఈ
సూర కవీంద్రునిం జునిగి చూతమటంచును మాటి మాటికిన్
ఈ రసమెత్తి దుష్కృతుల నిచ్చిన వారల నోరు మొత్తుడీ
మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్
హ (2)
* హయమది సీత పోత వసుధాధిపుడారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుడ,సహ్యజవారధి ,మారుడంజనా
ప్రియ తనయుండు,లచ్చన విభీషణుడా గుడిమెట్ట లంక నా
జయమును బోత రక్కసుని చావును నేడవనాడు చూడుడీ
* హాటక గర్భ వధూలీ
లాటన చలితాంఘ్రి నూపు రారావ శ్రీ
పాటచ్చరములు తేనియ
తేటలు మా కూచి మంచి తిమ్మయ మాటల్