నారాయణ శతకము - బమ్మెర పోతన

 

*  అధికాఘౌఘ తమోదివాకరమునై యద్రీంద్రజా జిహ్వకున్
      సుధయై వేదవినూత్నరత్నములకున్ సూత్రాభిధానంబునై
      బుధసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్
      విధులై మీ బహునామరాజి వెలయున్ వేదాత్మ, నారాయణా ! 

    * అన్నాకృష్ణమ నేడు వేల్పులకు మీఁదన్నార మీచట్లలో
      వెన్నల్ ముట్టకు మన్న నాక్షణమున న్విశ్వాకృతిస్ఫూర్తివై
      యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్
      గన్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై కన్పింతు, నారాయణా !  

    * అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్
      విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్
      గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ
      కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా !  

    * అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతసామర్ధ్యులై
      భ్రమరీదండము మందరాచలముగాఁ బాథోనిధిం ద్రచ్చగా
      దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
      గమఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ నారాయణా !  

    * అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
      యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
      బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే
      పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా !  

ఆ (0)    

ఇ (2)    

    * ఇరవొందన్ సచరాచరప్రతతుల న్నెన్నంగ శక్యంబు కా
      కరయన్ పద్మభవాండ భాండచయము న్నారాంగ మీకుక్షిలో
      నరుదార న్నుదయించుఁ బెంచు నడఁగు న్నన్నారికేళోద్భవాం
      తర వాఃపూరము చంద మొంది యెపుడున్ దైత్యారి నారాయణా !  

    * ఇల నెవ్వారి మనంబులో నెఱుక దా నెంతెంత గల్గుండు నా
      కొలదిం జెంది వెలుంగుచుందు కలయ న్గోవింద నీ రూపులన్
      అలరన్నంబు మితంబు లై సరసిలో నంభోరుహంబుల్ దగన్
      నిల నొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా !  

ఈ (0)    

ఉ (1)    

    * ఉల్లోలంబుగాఁ గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ
      మ్మిల్లం బల్లలనాడ రాగరససమ్మిశ్రంబుగా నీవు వ్రే
      పల్లెం దాడుచు గోప గోనివహ గోపస్త్రీల యుల్లంబు మీ
      పిల్లంగ్రోవిని జుట్టి రాఁ దిగుచు నీ పెంపొప్పు, నారాయణా !  

ఊ (0)    

ఋ (0)    

ౠ (0)    

ఎ (1)    

    * ఎల రారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
      బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లోపెడున్
      కలయం బావకుచేతఁ బట్టువడు నక్కాష్ఠంబుపైఁ గీటముల్
      నిలువన్నేర్చునె భక్తపోషణ కృపానిత్యాత్మ, నారాయణా !  

ఏ (1)    

    * ఏ భావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
      యే భావంబున ద్రౌప దయ్యెడ రమాధీశా యనె న్వాయసం
      బే భావంబున నీ శరణ్య మనెనో యీ నీ కృపాదృష్టిచే
      నా భావంబున నీ తలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా !  

ఐ (0)    

ఒ (2)    

    * ఒకకాంతామణి కొక్క డీవు మఱియు న్నొక్కర్తె కొక్కండవై
      సకలస్త్రీలకు సంతతం బలర రాసక్రీడ తన్మధ్య క
      ల్పకమూలంబు సవేణునాదరస మొప్పంగా బదార్వేల గో
      పికలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా !  

    * ఒరులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయు న్నొప్పార నేకాంత మం
      దరయం బై పడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
      మరణావస్థను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
      ధరలోన న్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా !  

ఓ (0)    

ఔ (0)    

అం (0)    

అః (0)    

క (12)    

    * కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా
      ల్కడలిన్ బన్నగశాయివై భువనముల్ గల్పించు సత్పుత్రునిన్
      బొడమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
      పడతిం గన్న పదారవిందముల నే భావింతు నారాయణా !  

    * కడకుం బాయక వేయినోళ్ళు గల యా కాకోదరాధీశుఁడున్
      గడముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి
      మ్మడరన్ సన్నుతి సేయ నాదువశమే! యజ్ఞాని లోభాత్ముఁడన్
      జడుఁడ న్నజ్ఞుఁడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ నారాయణా !  

    * కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
      శరణం బన్నఁ గృశాను భానుశతతేజస్ఫూర్తి యైనట్టి మీ
      కరచక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
      పరసద్భక్త భయానక ప్రకర సత్ప్రాకట్య నారాయణా !  

    * కలయ న్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
      వలనన్ భక్తి విహీనుఁడైన పిదపన్ వ్యర్థప్రయత్నంబె పో
      గులకాంతామణి గొడ్డువోయిన గతిం గొవ్వారుసస్యంబు దా
      ఫలకాలంబుల నీచపోవు పగిదిన్ పద్మాక్ష, నారాయణా !  

    * కలయం దిక్కులు నిండి చండతరమై కప్పారు మేఘౌఘముల్
      వెలయన్ ఘోరసమీరణస్ఫురణచే వే పాయుచందంబునన్
      జలదంభోళి మృగాగ్నితస్కరరుజాశత్రోరగవ్రాతముల్
      దొలఁగు న్మీ దగు దివ్యమంత్రపఠనన్ దోషఘ్న, నారాయణా !  

    * కలితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
      నలి నొప్పారెడు మంత్రరాజ మగు నీ నామంబు ప్రేమంబునన్
      అలరన్నెవ్వని వాక్కునం బొరయదో యన్నీచు దేహంబు దా
      వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా !  

    * కలిధర్మంబునఁ బాపసంకలితులై గర్వాంధులై తుచ్ఛులై
      కులశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
      బలిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
      వలనం గల్క్యవతార మొందఁగల నిన్ వర్ణింతు నారాయణా !  

    * కలుషాగాథవినాశకారి యగుచుం గైవల్యసంధాయియై
      నలి నొప్పారెడు మంత్రరాజమగు నీ నామంబు ప్రేమంబుతో
      నలర న్నెవ్వని వాక్కునం బొరయదే నన్నీచు ఘోరాత్మయున్
      వెలయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ, నారాయణా !  

    * కసవొప్పన్ పసి మేసి ప్రొద్దు గలుగం గాంతారముం బాసి య
      ప్పసియు న్నీవును వచ్చుచో నెదురుఁగా బైకొన్న గోపాంగనా
      రసవద్వృత్తపయోధరద్వయ హరిద్రాలేపనామోదముల్
      పసిఁ గొంచున్ బసిఁ గొంచు వచ్చుటలు నే భావింతు, నారాయణా !  

    * కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయన్ సము
      త్తాలాలోల తమాలపాదప శిఖాంతస్థుండవై వేణురం
      ధ్రాలిన్ రాగరసంబు నిండ విలసద్రాగంబు సంధించి గో
      పాలవ్రాతము గండుగోయిలలుగా వర్ణింతు, నారాయణా !  

    * కుల మెన్నం గొల దేల యేకులజుఁడుం గోత్రాభిమానాభిలా
      షలునజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
      యలరారం బరుసంబు సోఁకు నిను మున్ హేమాకృతిస్తోమమై
      వెలయు న్నాగతివాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా !  

    * కేలన్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
      బీలీపించముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్ గట్టి క
      ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
      వాలన్ గాచినభావ మిట్టి దని నే వర్ణింతు, నారాయణా !  

ఖ (0)    

గ (2)    

    * గగనాద్యంచిత పంచభూతమయమై కంజాతజాండావలిన్
      సగుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా
      సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్ష్మంబునై
      నిగమోత్తంస గుణావతంస సుమహానిత్యాత్మ, నారాయణా !  

    * గణుతింపన్ బహుధర్మశాస్త్రనిగమౌఘం బెప్పుడు న్ని న్నకా
      రణబంధుండని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగ నే
      బ్రణతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడి లేకుండినన్
      ఋణమా నానుతి నీవు శ్రీపతివి నీ కే లప్పు? నారాయణా !  

ఘ (1)    

    * ఘనభోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
      ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై
      మనుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
      యొనర న్నొప్పెడువారు నీ పదరుచి న్నూహించు నారాయణా !  

ఙ (0)    

చ (4)    

    * చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగ సుజ్ఞాని యై
      మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నామర్మంబు వీక్షింపఁడే
      మొదలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా
      కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త నారాయణా !  

    * చన్నుల్ మీదిఁకి చౌకళింప నడుముం జవ్వాడ కందర్పసం
      పన్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా
      విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ
      వన్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే వర్ణింతు, నారాయణా !  

    * చల్ల ల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
      వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపాంబులన్
      చల్లన్ జల్లనిచూపు జల్లు మని గోపస్త్రీలపైఁ జల్లు మీ
      చల్లంబోరుతెఱంగు జిత్తమున నే జర్చింతు నారాయణా !  

    * చెల్లం జేసితి పాతకంబులు మదిన్ శ్రీనాథ మీ నామముల్
      పొల్లుల్ బోవని నమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
      చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
      తల్లిం దండ్రియు నీవుగాక యొరులే తర్కింప నారాయణా !  

ఛ (0)    

జ (2)    

    * జగదాధారక భక్తవత్సల కృపాజన్మాలయాపాంగ ! భూ
      గగనార్కేందుజలాత్మపావక మరుత్కాయా ! ప్రదీపప్రయో
      గి గణస్తుత్య మహాఘనాశన ! లసద్గీర్వాణ సంసేవితా !
      త్రిగుణాతీత ! ముకుంద ! నాదు మదిలో దీపింపు, నారాయణా !  

    * జడ యెంతేఁ దడ వయ్యె జెయ్యి యలసెన్ శైలంబు మాచేతులం
      దిడు మన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్ట నె
      క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్
      గొడుగై యుండగఁ గేలఁ బూనితి గదా గోవింద, నారాయణా !  

ఝ (0)    

ఞ (0)    

ట (0)    

ఠ (0)    

డ (0)    

ఢ (0)    

ణ (0)    

త (4)    

    * తనకున్ సాత్వికసంపదాన్విత మహాదాసోహభావంబునన్
      ననయంబు న్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్
      జనితాహ్లాదముతోడ నీ చరణముల్ సద్భక్తి పూజించి నిన్
      గనుగొన్నంతనె కల్మషంబు లడఁగుం గర్మఘ్న నారాయణా !  

    * తనచిత్తాబ్జము మీ పదాబ్జములకుం దాత్పర్యసద్భక్తి తం
      తున బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె
      ల్లను విచ్ఛిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధి యైనట్టి దా
      సున కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా !  

    * తనువుం జీవుఁడు నేక మైనపిదపన్ ధర్మక్రియారంభుఁడై
      యనయంబు న్మది దన్నెఱుంగక తుది న్నామాయచే మగ్నుఁడై
      తనుతత్త్వాదివియోగమైన పిదపం దా నేర్చునే నీదు ద
      ర్శన మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా !  

    * తపముల్ మంత్రసమస్తయజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
      జపముల్ పుణ్యసుతీర్థసేవఫలముల్ సద్వేదవిజ్ఞానమున్
      ఉపవాసవ్రతశీలకర్మఫలముల్ ఒప్పార నిన్నాత్మలో
      నుపమింపం గలవారికే గలుగు వేయు న్నేల నారాయణా !  

థ (0)    

ద (1)    

    * దళదిందీవర నీలనీరద సముద్యద్భాసితాకార, శ్రీ
      లలనా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
      మల నాభీచరణారవిందజనితామ్నాయాద్య గంగా ! లస
      జ్జలజాతాయతనేత్ర నిన్ను మదిలోఁ జర్చింతు నారాయణా !  

ధ (3)    

    * ధర గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహిముం జేసినన్
      పరగం జెల్లుట సూచి తీ భువనసంపాద్యుండ వైనట్టి మీ
      వరదాసావలి దాసదాసి నని దుర్వారౌఘముల్ జేసితిన్
      కరుణం జేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా !  

    * ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
      పరమామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
      సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీరంగ సత్పుత్రియై
      వరుస న్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణా !  

    * ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
      పరగం బైతృక తర్పణంబు కొరకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్
      నిరువై యొక్కటిమారు క్షత్రవరుల న్నేపార నిర్జించి త
      త్పరశుభ్రాజిత రామనామము కడున్ ధన్యంబు నారాయణా !  

న (11)    

    * నరసింహాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ
      ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో
      దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం
      దిర పీతాంబర భక్తవత్సల కృపన్ దీవింపు నారాయణా !  

    * నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
      పెనుదైవంబులఁ గోరి తా మనమునన్ సేవించుచందంబు తా
      నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూని వే
      ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా !  

    * నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీ నామమున్ వీనులన్
      విని మోదింపనివాఁడు చెవ్డు మరి నిన్ వేడ్కన్ మనోవీథినిన్
      గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై
      తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా !  

    * నినుఁ వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా
      నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా
      నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
      నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా !  

    * నిరతానందవియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
      కరుణాహీనమనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై
      పరుషవ్యాధినిబద్ధులై పతితులై భగ్నాంగులై మ్రగ్గువా
      రరయ న్ని న్నొగి నాత్మయం దిడనివా రబ్జాక్ష నారాయణా !  

    * నీ పుత్రుండు చరాచరప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
      నీ పుణ్యాంగన సర్వజీవతతుల న్నిత్యంబు రక్షింపఁగా
      నీ పాదోదక మీజగత్రయముల న్నిష్పాపులం జేయఁగా
      నీ పెంపేమని చెప్పవచ్చు సుగుణా నిత్యాత్మ నారాయణా !  

    * నీ మూర్తుల్ గన నీ కథల్ వినఁ దుదిన్ నీ పాద నిర్మాల్యని
      ష్ఠామోదంబు నెఱుంగ, నీ చరణతోయంబాడ, నైవేద్యముల్
      నీమం బొప్ప భజింప నీ జపము వర్ణింపన్ గృపం జేయవే
      శ్రీ మించన్ బహుజన్మ జన్మములకున్ శ్రీయాదినారాయణా !  

    * నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్
      నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీ నామజప్యంబునన్
      నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
      నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా !  

    * నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁడౌ
      నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
      నీవే శంకరమూలమంత్ర మరయ న్నీవే జగత్కర్తవున్
      నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా !  

    * నెరయ న్నిర్మల మైన నీ స్తుతికథానీకంబు పద్యంబులో
      నొరుగుల్ మిక్కిలి గల్గెనేనియుఁ గడు న్యోగ్యంబె చర్చింపఁగాఁ
      గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
      జెఱకుం గోలకు తీపు గాక కలదే చేదెందుఁ నారాయణా !  

    * నే నీదాసుఁడ నీవు నా పతివి నిన్నే కాని యొండెవ్వరిన్
      ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నానేర్చుచందంబునన్
      నీ నామస్తుతు లాచరించు నెడల న్నేతప్పులుం గల్గినన్
      వానిన్ లోఁ గొనుమయ్య తండ్రి ! విహితవ్యాపార నారాయణా !  

ప (12)    

    * పటుగర్భాంతరగోళభాగమున నీ బ్రహ్మాండభాండంబు ప్రా
      కట దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం గల్పాంత మంభోధిపై
      వటపత్రాగ్రముఁ జెంది యొప్పిన మిము న్వర్ణింపఁగా శక్యమే
      నిటలాక్షాంబురుహాసనాదికులకు న్నిర్వాణ, నారాయణా !  

    * పరమంబై పరతత్వమై సకలసంపత్సారమై భవ్యమై
      సురసిద్ధోరగయక్ష పక్షి మునిరక్షో హృద్గుహాభ్యంతర
      స్థిరసుజ్ఞానసుదీపమై శ్ర్తుతికళాసిద్ధాంతమై సిద్ధమై
      సరి లే కెప్పుడు నీదునామ మమరున్ సత్యంబు, నారాయణా !  

    * పరమజ్ఞాన వివేక పూరిత మహా భవ్యాంతరాళంబునన్
      పరగ న్నీ నిజనామమంత్ర మొనరన్ భక్తి న్ననుష్ఠింపుచుం
      దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
      డరుగున్ భవ్యపదంబు నొందుటకునై యవ్యక్త నారాయణా !  

    * పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబు గా మీఁద మీ
      చరణాంభోరుహదర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
      ధరలోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
      బొరయ న్నేర్చునె దుర్లభం బగు గృపాంభోజాక్ష నారాయణా !  

    * పరిపంధిక్రియ నొత్తి వెంటఁ బడునప్పాపంబుఁ దూలించి మీ
      చరణాబ్జస్థితి పంజరంబు శరణేచ్ఛం జొచ్చితిం గావు మీ
      బిరుదుం జూడుము మీరు సూడఁగ భవద్భృత్యుండు దుఃఖంబులం
      బొరయ న్నీ కపకీర్తి గాదె శరదంభోజాక్ష నారాయణా !  

    * పరుషాలాపము లాడ నోడి మది నీపాపార్జనారంభుఁడై
      నిరసిం చేరికిఁ గీడుసేయక మది న్నిర్ముక్తకర్ముండునై
      పరమానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించు నా
      పరమజ్ఞాని భవత్కృపం బొరయు నో పద్మాక్ష నారాయణా !  

    * పసులంగాపరి యే మెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా
      గ్విసరారావము మోవి దా వెదురుగ్రోవిం బెట్టినాఁ డంచు నిన్
      గసటుల్ సేయఁగ నాఁడు గోపిక లతద్గానంబులన్ మన్మథ
      వ్యసనాసక్తులఁ జేయుచందములు నే వర్ణింతు, నారాయణా !  

    * పురము ల్మూడును మూడులోకములు నేప్రొద్దు న్విదారింపఁ ద
      త్పురనారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
      వరబోధద్రుమ సేవఁ జేయుటకునై వారిం బ్రభోధించి య
      ప్పురముల్ గెల్చిన నీ యుపాయము జగత్పూజ్యంబు నారాయణా !  

    * పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
      గ రసావేశత రిత్త ద్రచ్చనిడ నా కవ్వంబు నీవు న్మనో
      హరలీలం గనుగొంచు ధేను వని యయ్యాబోతునుం బట్టి తీ
      వరవృత్తాంతము లేను పుణ్యకథగా వర్ణింతు, నారాయణా !  

    * పొనర న్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
      దునికిస్థానము నిష్టభోగములకు న్నుత్పత్తి యేప్రొద్దునున్
      ఘనపాపంబుల వైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ
      వినుతాంఘ్రిద్వయపద్మసేవన గదా విశ్వేశ, నారాయణా !  

    * ప్రభ మీ నాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
      బ్రభవంబైన విరించి ఫాలజనిత ప్రస్వేదసంభూతుఁడై
      యభిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా
      నభవాఖ్యుండవు నిన్నెఱుంగవశమే యబ్జాక్ష, నారాయణా !  

    * ప్రమదం బారఁగ పుణ్యకాలగతులన్ భక్తి న్ననుష్ఠింపుచున్
      నమర న్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణి గ్రామ దా
      నము లామ్నాయ విధోక్తి భూసురులకున్ సన్మార్గుఁడై యిచ్చువాఁ
      డమరేంద్రార్చిత వైభవోన్నతుఁడగు న్నామీఁద నారాయణా !  

ఫ (0)    

బ (2)    

    * బలుకర్మాయత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
      జలయంత్రాన్విత బంధయాతనగతిన్ సంసారకూపంబులో
      నలరం ద్రిమ్మరుచుండు నన్ను నకటా ! యార్తుండనై వేఁడెదన్
      వెలయ న్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా !  

    * బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
      బ్రహ్మాఖ్యం బరతత్వభోగములకున్ భవ్యాధినాథుండవై
      బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్ భావింప రాకున్న నా
      జిహ్మవ్యాపుల నెన్న నాదు వశమే చిద్రూప నారాయణా !  

భ (4)    

    * భవనాశిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణవే
      త్రవతి న్నర్మద పెన్న గౌతమి పయోరాశి న్వియద్గంగ యం
      దవగాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
      భవదంఘ్రిస్మరణంబునం గలుగు పో పద్మాక్ష నారాయణా !  

    * భవరోగంబుల మందు పాతకతమోబాలార్కబింబంబు క
      ర్మ విషజ్వాలసుధాంశుగామృత తుషారవ్రాతపాథోధిమూ
      ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
      భువిలో మీదగు మంత్రరాజ మమరున్ భూతాత్మ, నారాయణా !  

    * భీమాకారవరాహమై భువనముల్ భీతిల్లి కంపింప ను
      ద్దామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్
      హేమాక్షాసురు వీఁకఁ దాకిఁ జయలక్ష్మిన్ గారవింపంగ నీ
      భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినున్ బూజింతు నారాయణా !  

    * భూతవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
      ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
      పేతంబై పరమాత్మవై నిలుతు నీ పెంపెవ్వరుం గాన ర
      బ్జాతోద్భూతసుజాతపూజితపదాబ్జశ్రేష్ట, నారాయణా !  

మ (6)    

    * మగమీనాకృతి వార్థిఁ జొచ్చి యసుర న్మర్దించి యవ్వేదముల్
      మగుడం దెచ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారఁగాఁ
      బగ సాధించిన దివ్యమూర్తి వని నే భావింతు నెల్లప్పుడున్
      ఖగరాజధ్వయ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణా !  

    * మదిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
      గదియం జేర్చిన వాని కే నొడయడన్ గా దంచు నత్యున్నతిన్
      పదిలుం డై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
      పదపద్మార్చకు లెంత పుణ్యులొ కృపాపారీణ నారాయణా !  

    * మన మార న్నచలేంద్రజాధిపతికి న్మస్తాగ్రమాణిక్యమై
      మునికోపానలదగ్ధ రాజతతికి న్ముక్తిస్ఫురన్మార్గమై
      యెనయన్ సాయకశాయికిం జననయై యేపారు మిన్నేటికిం
      జని మూలంబగు నంఘ్రి నాదు మదిలోఁ జర్చింతు నారాయణా !  

    * మమహంకార వికారసన్నిభ మహామత్తాది లోభాంధకా
      రముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రా దింక నాలోన నీ
      విమలాపాంగ దయా దివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
      కమలానంద విహారవక్షలలితా ! కంజాక్ష ! నారాయణా !  

    * మహియు న్నాకసముం బదద్వయ పరీమాణంబుగాఁ బెట్టి యా
      గ్రహ మొప్పం బలిమస్తకం బొక పదగ్రస్తంబుగా నెమ్మితో
      విహరించింద్ర విరించి శంకర మహావిర్భూత దివ్యాకృతిన్
      సహజంబై వెలసిల్లు వామన లసచ్చారిత్ర నారాయణా !  

    * మాపాలం గడుగ్రొవ్వి గోపికలతో మత్తిల్లి వర్తింతువే
      మాపాలెంబుల వచ్చి యుండుదు వెస న్మాపాలలో నుండు మీ
      మాపా లైన సుఖాబ్ధిలో మునుగుచున్ మన్నించి తా గొల్లలన్
      మాపాలం గలవేల్పు వీవె యని కా మన్నింతు, నారాయణా !  

య (1)    

    * యదువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్
      మదవద్ధేనుక ముష్టికాద్యసురులన్ మర్దించి లీలారసా
      స్పద కేళీ రతి రేవతీ వదన కంజాతాంతభృంగం బనన్
      విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా !  

ర (3)    

    * రమణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
      పము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
      రము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రాఖ్య కా
      వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా !  

    * రసనాగ్రంబున నీదు నామరుచియున్ రమ్యంబుగాఁ జెవ్లుకు
      న్నసలారంగ భవత్కథాభిరతియున్ హస్తాబ్జయుగ్మంబులన్
      వెస నీ పాదసుపూజితాదియుగమున్ విజ్ఙానమధ్యాత్మకున్
      వెస నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ, నారాయణా !  

    * రాణించెన్ గడు నంచు నీ సహచరుల్ రాగిల్లి సోలంగ మీ
      వేణుక్వాణము వీనులం బడి మనోవీథుల్ బయల్ ముట్టఁగా
      ఘోణాగ్రంబులు మీదిఁ కెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో
      శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ జర్చింతు, నారాయణా !  

ల (4)    

    * లలిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్ల న్మించెఁ బో నీకథా
      వళి కర్పూరము నించిన న్నితరమౌ వ్యర్థార్థకామోదముల్
      పెలుచం బూనిన యక్కరాటము తుదిన్ బేతేకరాటంబె పో
      చలదిందీవరపత్రలోచన ఘనశ్యామాంగ నారాయణా !  

    * లలితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
      బలుఁగు ల్వారఁగ నీ కటాక్షమునఁ దా మందంద గోపాంగనల్
      తలఁపు ల్పాదులు కట్టి కందళిత నూత్నశ్రీలు వాటింతు రా
      నెలతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీ యొప్పు నారాయణా !  

    * లలితాకుంచితవేణియం దడవిమొల్లల్ జాఱ ఫాలస్థలిన్
      దిలకం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్
      మొలకన్నవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకలన్ బోవఁగా
      నలి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు, నారాయణా !  

    * లీలన్ పూతన ప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి, దు
      శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
      రోల న్మద్దులు గూల్చిధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
      కూలన్ కంసునిఁ గొట్టి గోపికలకోర్కుల్ దీర్తు, నారాయణా !  

వ (10)    

    * వరకాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
      వెర వొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
      పురిలో నాడెడుభంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
      బురుహం బొప్ప నటించు టొప్పును సితాంభోజాక్ష, నారాయణా !  

    * వరనాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య
      ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
      బరమోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
      సరి యెవ్వారలు మీరు దక్కఁగ రమాసాధ్వీశ, నారాయణా !  

    * వరుసం దాటకిఁ జంపి కైశికు మఘ స్వాస్థ్యంబు గావించి శం
      కరుచాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం గల్యాణమై తండ్రిపం
      పరుదారన్ వనభూమి కేఁగి జగదాహ్లాదంబుగా రావణున్
      ధరణిం గూల్చిన రామనామము కడున్ ధన్యంబు నారాయణా !  

    * వరుసన్ గర్మపిపీలికాకృత తనూవల్మీకనాళంబులోఁ
      బరుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
      బరమోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచున్నుండు మీ
      తిరుమంత్రం బగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ, నారాయణా !  

    * విందు ల్వచ్చిరి మీ యశోదకడకు న్వేగంబె పొమ్మయ్యయో
      నందానందన ! చందనాంకురమ ! కృష్ణా ! యింకఁబో వేమి మా
      మందం జాతర సేయఁబోద మిదె రమ్మా యంచు మిమ్మెత్తుకో
      చందం బబ్బిన నుబ్బకుండుదురె ఘోషస్త్రీలు, నారాయణా !  

    * విందుల్ విందు లటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
      డందెల్ మ్రోయఁగ ముద్దుమోమలర నిన్నాలింగితుం జేయుచో
      డెందంబుల్ దనివార రాగరసవీటీలీలలన్ దేల్చు మీ
      మందస్మేర ముఖేందురోచులు మము న్మన్నించు, నారాయణా !  

    * విదితామ్నాయ నికాయ భూతములలో విజ్ఞానసంపత్కళా
      స్పద యోగీంద్రమనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
      త్రిదశవ్రాతకిరీట రత్నములలో దీపించుచున్నట్టి మీ
      పదపద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా !  

    * వెర వొప్ప న్బహుశాస్త్రమంత్రము లొగి న్వీక్షించి వే తెల్పి మీ
      వరనామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
      సరి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంసారమాతుఃపయో
      ధరదుగ్ధంబులు గ్రోల నేరరు వెసన్ దైత్యారి నారాయణా !  

    * వెలయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధాప్యకాలంబునన్
      బలురోగంబులు నంత్య మందు యముఁడుం బాధింప నట్టైన యీ
      పలుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
      ఫలితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా !  

    * వేదంబందు సునిశ్చయుండగు మహావేల్పెవ్వఁడో యంచు నా
      వేదవ్యాస పరాశరుల్ వెదకిన న్వేఱొండు లేఁడంచు మీ
      పాదాంభోజము లెల్లప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
      శ్రీదేవీవదనారవిందమధుపా శ్రీరంగ నారాయణా !  

శ (3)    

    * శ్రీకిన్మందిరమైన వక్షము, సురజ్యేష్ఠోద్భవస్థాన నా
      భీకంజాతము, చంద్రికాంతర సుధాభివ్యక్త నేత్రంబులున్,
      లోకస్తుత్య మరున్నదీజనక మాలోలాంఘ్రియున్ గల్గు నా
      లోకారాధ్యుఁడ వైన నిన్నెపుడు నాలోఁ జూతు, నారాయణా !  

    * శ్రీనారాయణ యన్నఁ జాలు దురితశ్రేణి న్నివారింపఁగా
      నానందస్థితి గల్గు నంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
      నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా యంచు ని
      న్నే నే నెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా !  

    * శ్రీరామామణిపాణి పంకజ మృదుశ్రీతజ్ఞపాదాబ్జ శృం
      గారాకారశరీర చారుకరుణాగంభీర సద్భక్త మం
      దారాంభోరుహపత్రలోచన కళాధారోరుసంపత్సుధా
      పారావార విహార ! నా దురితముల్ భంజింపు నారాయణా !  

ష (0)    

స (7)    

    * సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్
      నతిశాంతత్వము చిత్తశుద్ధికరము న్నధ్యాత్మయున్ ధ్యానమున్
      ధృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబు గాకుండ స
      మ్మతికిం జేరువ మీనివాససుఖమున్ మా నాథ నారాయణా !  

    * సరిఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
      పరమానంద సుబోధకారణ లసద్భస్మంబుపై నూఁది యా
      నిరతజ్ఞానసుకాంతి దర్పణమున న్నిస్సంగుఁడై తన్ను దా
      నరయం గాంచినవాఁడు నిన్నుఁగనువాఁ డబ్జాక్ష, నారాయణా !  

    * సర్వంబున్ వసియించు నీ తనువునన్ సర్వంబునం దుండగా
      సర్వాత్మా ! వసియించు దీవని మదిన్ సార్థంబుగాఁ జూచి యా
      గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా
      శ్రీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ, నారాయణా !  

    * సవిశేషోరు సువర్ణబిందు విలస చ్చక్రాంకలింగాకృతిన్
      భవుచే నుద్ధవుచేఁ బయోజభవుచేఁ బద్మారిచే భానుచే
      దివిజేంద్రాది దిశాధినాయకులచే దీప్యన్మునీంద్రాళిచే
      నవదివ్యార్చన లందుచుందువు రమానారీశ, నారాయణా !  

    * సుతదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండు నై
      యతనోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
      మృతిఁ బొందించి దమంబునన్ శమమునన్ మీఱంగ వర్తించు ని
      ర్గతసంసారి భవత్కృపం బొరయ నో కంజాక్ష నారాయణా !  

    * స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్
      దంభోళిం గడువంగ హేమకశిపోద్దండాసురాధీశ్వరున్
      శుంభద్గర్భము వ్రచ్చి వాని సుతునిన్ శోభిల్ల మన్నించి య
      జ్జభారాతిని బ్రీతిఁ దేల్చిన నినుం జర్చింతు నారాయణా !  

    * స్నానంబుల్ నదులందు జేయుట గజస్నానంబు చందంబగున్
      మౌనం బొప్ప జపించువేద మటవీ మధ్యంబులో నేడ్పగున్
      నానాహోమము లెల్ల బూడిదలలోన న్వేల్చు నెయ్యై చనున్
      నీనామోక్తియు నీ పదాబ్జరతియున్ లేకున్న నారాయణా !  

హ (1)    

    * హరుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం
      గరిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవు న్నారదున్
      గర మొప్పన్విదురున్ బరాశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్
      నరు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు, నారాయణా !