దాశరధీ శతకము - కంచెర్ల గోపన్న (రామదాసు)


    *  అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్
      కొండలవంటివైన వెసఁ గూలి నశింపక యున్నె సంతతా
      ఖండలవైభవోన్నతులు గల్గక మానునె మోక్షలక్ష్మికై
      దండయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయొనిధీ! 

    * అగణిత జన్మకర్మ దురితాంబుధిలో బహు దుఃఖవీచికల్
      దెగిపడ నీదలేక జగతీధవ! నీ పదభక్తినావచేఁ
      దగిలి తరింపఁ గోరితిఁ బదంపడి నాదు భయంబు మాన్ పవే
      తగదని చిత్తమందిడక, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * అగణితసత్యభాష శరణాగతపోష దయాలసజ్ఝరీ
      విగతనమస్తదోష పృథివీసురతోష త్రిలోకపూతకృ
      ద్గగనధునీ మరంద పదకంజవిశేష మణిప్రభా ధగ
      ద్ధగితవిభూష భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
      ద్ద్విజ్జముని కోటికెల్లఁ గులదేవతయ్యు దినేశ వంశ భూ
      భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
      డ్ఢ్వజ! మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ! 

    * అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ
      కనుజుడుగా జనించి, కుజనావళినెల్ల నడంచి, రోహిణీ
      తనయుడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై
      తనరిన వేల్పవీవె గద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖ కం
      చెర్ల కులోద్భవుండన బ్రసిద్ధుడనై భవదంకితంబుగా
      నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
      ద్వల్లభ! నీకు దాసుడను! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ! జానకీ
      కువలయనేత్రి గబ్బిచనుగొండల నుండు ఘనంబ! మైథిలీ
      నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవె కాఁ
      దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఆ (1)    

    * ఆర్యులకెల్ల మ్రొక్కి, వినతాంగుడనై, రఘునాథభట్టరా
      చార్యుల కంజలెత్తి, కవిసత్తములన్ వినుతించి, కార్య సౌ
      కర్యమెలర్ప నొక్క శతకంబొనగూర్చి రచింతు నేడు, తా
      త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఇ (2)    

    * ఇతడు దురాత్ముడంచు జనులెన్నగ నారడిఁ గొంటి, నేనె పో
      పతితుడనంటి పో, పతితపావనమూర్తివి నీవు గల్గ నే
      నితరుల వేడనంటి, నిహమిచ్చిన నిమ్ము, పరం బొసంగుమీ
      యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ
      ద్గతమని నమ్మి కొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * ఇరువదియొక్క మారు ధరణీశులనెల్ల వధించి, తత్కళే
      బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి, భూ
      సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
      ధరణి నొసంగితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఈ (0)    

ఉ (0)    

ఊ (0)    

ఋ (0)    

ౠ (0)    

ఎ (2)    

    * ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిఁ గొంటివి వింతగాదె! నీ
      మంతన మెట్టిదో యుడుత మైని కరాగ్రనఖాంకురంబులన్
      సంతస మందజేసితివి! సత్కులజన్మ మదేమిలెక్క! వే
      దాంతముగాదె నీ మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * ఎక్కడ తల్లిదండ్రి, సుతు లెక్కడివారు, కళత్ర బాంధవం
      బెక్కడ, జీవు డెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవా
      డొక్కడె! పాపపుణ్య ఫలమొందిన నొక్కడె! కానరాడు వే
      రొక్కడు వెంటనంటి! భవ మొల్లనయా! కృపఁ జూడవయ్య! నీ
      టక్కరిమాయలందిడక, దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఏ (0)    

ఐ (0)    

ఒ (0)    

ఓ (0)    

ఔ (0)    

అం (1)    

    * అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
      క్షించిన చాలు, దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ
      లించెద వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదు బంటనై
      దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ!  

అః (0)    

క (9)    

    * కంటి నదీతటంబుఁ బొడగంటిని భద్రనగాధివాసమున్
      గంటి నిలాతనూజ నురుకార్ముక మార్గణ శంఖ చక్రముల్
      గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి, కృతార్థుడనైతి నో జగ
      త్కంటకదైత్య నిర్దళన! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కనకవిశాలచేల! భవకానన శాతకుఠారధార! స
      జ్జన పరిపాలశీల! దివిజస్తుత సద్గుణకాండ! కాండ సం
      జనిత పరాక్రమ క్రమవిశారద! శారదకందకుంద చం
      దనఘన సారయశ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కరమనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు త్రాడుగా
      దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
      ధరణి చలింప, లోకములు తల్లడమందగఁ, గూర్మమై ధరా
      ధరము ధరించితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కరములు మీకు మ్రొక్కులిడఁ, గన్నులు మిమ్మునె జూడ, జిహ్వ మీ
      స్మరణ దలిర్ప, వీనులు భవత్కథలన్ వినుచుండ, నాస మీ
      యరుతను బెట్టు పూసరుల కాసగొనం, బరమార్థ సాధనో
      త్కరమిది చేయవే కృపను, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కలియుగ మర్త్యకోటి నిను గన్ గొనరాని విధంబొ! భక్తవ
      త్సలత వహింపవో! చటుల సాంద్ర విపద్దశవార్ధిఁ గ్రుంకుచో
      బిలచిన బల్క వింత మరపే! నరు లిట్లనరాదుగాక! నీ
      తలపున లేదె సీతచెర! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కాంచనవస్తు సంకలిత కల్మష మగ్నిపుటంబు వెట్టి వా
      రించినరీతి, నాత్మ నిగిడించిన దుష్కర దుర్మలత్రయం
      బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన
      త్కాంచన కుండలాభరణ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కుక్షి నజాండపంక్తు లొనగూర్చి చరాచర జంతుకోటి సం
      రక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా
      పక్షము నీవు గావలదె? పాపములెన్ని యొనర్చినన్, జగ
      ద్రక్షక! కర్త నీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కొంజక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్
      రంజిలఁ ద్రవ్వి కన్ గొనని రామనిధానము, నేడు భక్తి సి
      ద్ధాంజనమందు హస్తగతమయ్యె, భళీ' యనగా మదీయ హృ
      త్కంజమునన్ వసింపుమిక దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * కోతికి శక్యమా యమరకోటుల గెల్వను? గెల్చెఁ బో నిజం
      బాతని మేన శీతకరుడౌట దవానలు డెట్టి వింత? మా
      సీత పతివ్రతామహిమ, సేవకు భాగ్యము, మీ కటాక్షమున్
      ధాతకు శక్యమా పొగడ? దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఖ (1)    

    * ఖరకరవంశజా! విను మఖండిత భూత పిశాచ ఢాకినీ
      జ్వర పరితాప సర్ప భయవారకమైన భవత్పదాబ్జ వి
      స్ఫుర దురు వజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
      ద్ధర బిరుదాంక మేమరకు దాశరథీ! కరుణాపయోనిధీ!  

గ (2)    

    * గద్దరియోగి హృత్కమల గంధ రసానుభవంబుఁ జెందు పె
      న్నిద్దపు గండుఁదేటి! ధరణీసుత కౌగిలిపంజరంబునన్
      ముద్దులుగుల్కు రాచిలుక! ముక్తినిధానమ! రామ! రాఁగదే
      తద్దయు నేడు నా కడకు, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * గురుతరమైన కావ్యరస గుంభన కబ్బుర మంది ముష్కరుల్
      సరసుల మాడ్కి సంతసిల జాలుదు రోటు శశాంకచంద్రికాం
      కురముల కిందుకాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్య భూ
      ధరమున జారునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఘ (1)    

    * ఘోర కృతాంత వీరభటకోటికి గుందెదిగుల్, దరిద్రతా
      కార పిశాచ సంహరణకార్యవినోది, వికుంఠమందిర
      ద్వార కవాటభేది నిజదాస జనావళి కెల్లప్రొద్దు నీ
      తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఙ (0)    

చ (6)    

    * చక్కెర మాని వేము దినజాలిన కైవడి, మానవాధముల్
      పెక్కురు బక్కదైవముల వేమరు గొల్చెద రట్లకాదయా
      మ్రొక్కిన నీకు మ్రొక్కవలె; మోక్షమొసంగిన నీవ యీవలెన్
      దక్కిన మాటలేమిటికి, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * చక్కెరలప్పకున్, మిగుల జవ్వని కెంజిగురాకుమోవికిన్,
      జొక్కపు జుంటితేనియకుఁ జొక్కిలుచుం గనలేరుగాక నే
      డక్కట! రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా
      తక్కిన మాధురీమహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్కవింత, సు
      స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింత గాని, మీ
      స్మరణ దనర్చు మానవులు సద్గతి జెందిన దెంతవింత యీ
      ధరను? ధరాత్మజారమణ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీగడ పంచదారతో
      మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా
      మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటదో యిటన్
      దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణా పయోనిధీ!  

    * చిరతర భక్తి నొక్క తులసీదళ మర్పణ సేయువాడు ఖే
      చర గరు డోరగ ప్రముఖసంఘములో వెలుగన్ సదా భవత్
      స్ఫురదరవింద పాదములఁ బూజ లొనర్చినవారి కెల్లఁ ద
      త్పర మరచేత ధాత్రి గద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * చేసితి ఘోరకృత్యములు, చేసితి భాగవతాపచారముల్,
      చేసితి నన్యదైవములఁ జేరి భజించినవారి పొందు, నే
      జేసిన నేరముల్ దలచి చిక్కులు బెట్టకుమయ్య! యయ్య! నీ
      దాసుడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఛ (0)    

జ (5)    

    * జనవర! మీ కథాళి వినసైపక కర్ణములందు ఘంటికా
      నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు! ని
      న్ననయము నమ్మికొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం
      దననుత! మాకొసంగుమయ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * జలనిధిలోన దూటి, కులశైలము మీటి, ధరిత్రిఁ గొమ్మునం
      దలవడ మాటి, రక్కసుని యంగము గీటి, బలీంద్రునిన్ రసా
      తలమున మాటి, పార్థివకదంబము గూల్చిన మేటి రామ! నా
      తలపున నాటి రాఁగదవె! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * జలనిధు లేడు నొక్కమొగిఁ జక్కికిఁ దెచ్చె శరంబు, రాతి నిం
      పలరగఁ జేసె నాతిగఁ బదాబ్జపరాగము, నీ చరిత్రముం
      జలజభవాది నిర్జరులు సన్నుతి సేయగలేరు కావునన్
      దలప నగణ్యమయ్య యిది దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * జీవన మింకఁ బంకమున జిక్కిన మీను చలింప కెంతయున్
      దావున నిల్చి, జీవనమె తద్దయుఁ గోరువిధంబు చొప్పడన్
      దావలమైనగాని గురిఁ దప్పనివాడు తరించువాడయా
      తావక భక్తియోగమున, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * జుర్రెద మీ కథామృతము, జుర్రెద మీ పదకంజతోయమున్ ,
      జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు, నే
      జుర్రెద జుర్రజుర్రగ రుచుల్ గనువారి పదంబుఁ గూర్పవే!
      తర్రులతోడి పొత్తిడక దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఝ (0)    

ఞ (0)    

ట (0)    

ఠ (0)    

డ (1)    

    * డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
      దాసుని దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు; నే
      జేసిన పాపమా? వినుతి సేసినఁ గావవు! గావుమయ్య! నీ
      దాసులలోన నేనొకడ దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఢ (0)    

ణ (0)    

త (3)    

    * తప్పు లెరుంగలేక దురితంబులు సేసితినంటి, నీవు మా
      యప్పవు గావుమంటి, నిక నన్యులకున్ నుదురంటనంటి, నీ
      కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటునంటి, నా
      తప్పుల కెల్ల నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * తరణికులేశ! నానుడులదప్పులు గల్గిన నీదునామ స
      ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె? వియన్నదీ జలం
      బరుగుచు వంకయైన మలినాకృతిబారిన దన్మహత్త్వమున్
      దరమె గణింపనెవ్వరికి దాశరథీ! కరుణపయోనిధీ!  

    * తరువులు పూచి కాయలగుఁ, దత్కుసుమంబులు పూజగా భవ
      చ్చరణము సోకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై
      కరి భట ఘోటకాంబర నికాయములై విరజానదీ సము
      త్తరణ మొనర్చుఁ జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!  

థ (0)    

ద (7)    

    * దారుణ పాతకాబ్ధికి సదా బడబాగ్ని, భవాకులార్తి వి
      స్తార దవానలార్చికి సుధారసవృష్టి, దురంత దుర్మతా
      చార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార, నీ
      తారకనామ మెన్నుకొన దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * దీక్ష వహించి నాకొలది దీనుల నెందరిఁ గాచితో జగ
      ద్రక్షక! తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే
      యక్షయమైన వల్వ లిడి తక్కట! నా మొర చిత్తగించి ప్ర
      త్యక్షము గావదేమిటికి? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * దురమునఁ దాటకం దునిమి, ధూర్జటివిల్ దునుమాడి, సీతనుం
      బరిణయమంది, తండ్రి పనుపన్ ఘనకాననభూమికేగి, దు
      స్తర పటు చండ కాండకులిశాహతి రావణ కుంభకర్ణ భూ
      ధరములఁ గూల్చితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * దురిత లతానుసారి భవదుఃఖకదంబము రామనామ భీ
      కరతర హేతిచేఁ దెగి వకావకలై చనకుండనేర్చునే!
      దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాది కీటకో
      త్కరము విలీనమై చనదె? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * దురితలతాలవిత్ర! ఖరదూషణ కాననవీతిహోత్ర! భూ
      భరణకళావిచిత్ర! భవబంధవిమోచనసూత్ర! చారు వి
      స్ఫురదరవిందనేత్ర! ఘనపుణ్యచరిత్ర! వినీలభూరి కం
      ధరసమగాత్ర! భద్రగిరి దాశరథీ! కరుణపయోనిధీ!  

    * దైవము తల్లిదండ్రి తగు దాత గురుండు సఖుండు నిన్నెకా
      భావన సేయుచున్న తరిఁ బాపములెల్ల మనోవికార దు
      ర్భావితుఁ జేయుచున్నవి, కృపామతివై నను గావుమీ జగ
      త్పావనమూర్తి! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * దొరసిన కాయముల్ ముదిమి తోచినఁ జూచి, ప్రభుత్వముల్ సిరుల్
      మెరపులు గాగఁ జూచి, మరి మేదినిలో తమతోడివారు ముం
      దరుగుటఁ జూచి, చూచి, తెగు నాయువెరుంగక మోహపాశముల్
      దరుగనివారి కేమిగతి! దాశరథీ! కరుణాపయోనిధీ!  

ధ (1)    

    * ధారుణిఁ జాపఁ జుట్టిన విధంబునఁ గైకొని హేమనేత్రు డ
      వ్వారిధిలోన దాగినను, వాని వధించి, వరాహమూర్తివై
      ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్ ధరించి, వి
      స్తార మొనర్చితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

న (6)    

    * నీ మహనీయ తత్త్వరస నిర్ణయబోధ కథామృతాబ్ధిలోఁ
      దా మును గ్రుంకులాడక వృథా తనుకష్టముఁ జెంది మానవుం
      డీ మహిలోక తీర్థములనెల్ల మునింగిన దుర్వికార హృ
      త్తామసపంకముల్ విడునె? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోక మకల్మషంబుగా
      నీ సుత సేయు పావనము, నిర్మితికార్య ధురీణదక్షుడై
      నీ సుతు డిచ్చు నాయువులు, నిన్ను భజించిన గల్గకుండునే
      దాసుల కీప్సితార్థములు, దాశరథి! కరుణాపయోనిధీ!  

    * నీ సహజంబు సాత్త్వికము, నీ విడిపట్టు సుధాపయోధి, ప
      ద్మాసను డాత్మజుండు, గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం
      హాసన మిద్ధరిత్రి, గొడు గాకస, మక్షులు చంద్రభాస్కరుల్
      నీ సుమతల్ప మాదిఫణి, నీవె సమస్తము, గొల్చునట్టి నీ
      దాసుల భాగ్య మెట్టిదయ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొన గోరి వేడినన్
      జాలముచేసి డాగెదవు! సంస్తుతి కెక్కిన రామనామ మే
      మూలను దాచుకోగలవు? ముక్తికిఁ బ్రాపది! పాపమూల కు
      ద్దాలము గాదె మా యెడల, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * నేనొనరించు పాపము లనేకములైనను నాదు జిహ్వకున్
      బానకమయ్యె మీ పరమపావననామము, దొంటి చిల్క 'రా
      మా! నను గావు ' మన్న దుదిమాటకు సద్గతిఁ జెందెఁ గావునన్
      దాని ధరింపఁ గోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * నోచిన దల్లిదండ్రికిఁ దనూభవు డొక్కడె చాలు మేటి, చే
      చాచనివాడు, వేరొకడు చాచిన లేదన కిచ్చువాడు, నో
      రాచి నిజంబుకాని పలుకాడనివాడు, రణంబులోన మేన్
      దాచనివాడు, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

ప (10)    

    * "పరమదయానిధే! పతితపావననామ! హరే" యటంచు సు
      స్థిరమతులై సదాభజనసేయు మహాత్ముల పాదధూళి నా
      శిరమున దాల్తు మీరటకు జేరకుడంచు యముండు కింకరో
      త్కరముల కానబెట్టునట దాశరథీ! కరుణపయోనిధీ!  

    * పండితరక్షకుం డఖిల పాపవిమోచను డబ్జసంభవా
      ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండ కాండ కో
      దండకళా ప్రవీణు డగు తావక కీర్తివధూటి కిత్తుఁ బూ
      దండలు గాగ నా కవిత దాశరథీ! కరుణాపయోనిధీ!

      సత్యనారాయణ పిస్క  

    * పట్టితి భట్టరార్యగురు పాదము, లిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
      బెట్టితి, మంత్రరాజ మొడిఁ బెట్టితి, నయ్యమకింకరాళికిం
      గట్టితి బొమ్మ, మీ చరణకంజములందుఁ దలంపు బెట్టి పోఁ
      దట్టితి పాపపుంజముల, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పదయుగళంబు భూ గగన భాగములన్ వెసనూని విక్రమా
      స్పదుడగు నబ్బలీంద్రు నొకపాదమునం దలక్రింద నొత్తి మే
      లొదవ జగత్త్రయంబుఁ బురుహూతున కియ్య వటుండవైన చి
      త్సదమలమూర్తి నీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పరధనముల్ హరించి, పరభామల నంటి, పరాన్న మబ్బినన్
      మురిపముకాని, మీదనగు మోసమెరుంగదు మానసంబు, దు
      స్తరమిది! కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నే
      తరి దరిఁజేర్చి కాచెదవొ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పరుల ధనంబుఁ జూచి, పరభామలఁ జూచి హరింపఁగోరు మ
      ద్గురుతర మానసంబనెడి దొంగను బట్టి, నిరూఢదాస్య వి
      స్ఫురిత వివేకపాశములఁ జుట్టి, భవచ్చరణంబనే మరు
      త్తరువున గట్టివేయగదె దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పాతకులైన మీ కృపకుఁ బాత్రులు గారె తలంచిచూడఁ జ
      ట్రాతికి గల్గెఁ బావన, మరాతికి రాజ్యసుఖంబు గల్గె, దు
      ర్జాతికిఁ బుణ్యమబ్బెఁ, గపిజాతి మహత్త్వమునొందెఁ గావునన్
      దాతవు యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పాపములొందువేళ, రణ పన్నగ భూత భయ జ్వరాదులం
      దాపదనొందువేళ, భరతాగ్రజ! మిమ్ము భజించువారికిం
      బ్రాపుగ నీవుఁ, దమ్ము డిరుప్రక్కియలం జని తద్విపత్తి సం
      తాపము మాని కాతురట! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పెంపను దల్లివై, కలుషబృంద సమాగమ మొందకుండ ర
      క్షింపను దండ్రివై, మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా
      రింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగాగ స
      త్సంపదలియ్య నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * పెటపెట నుక్కుగంబమున భీకర దంత నఖాంకుర ప్రభా
      పటలము గప్ప నుప్పతిలి, భండనవీథి నృసింహ భీకర
      స్ఫుట పటుశక్తి హేమకశిపున్ విదళించి, సురారిపట్టి ను
      త్కటకృపఁ జూచితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

ఫ (0)    

బ (1)    

    * బొంకనివాడె యోగ్యు, డరిబృందము లెత్తినచోటఁ జివ్వకున్
      జంకనివాడె జోదు, రభసంబున నర్థి కరంబు సాచినన్
      గొంకనివాడె దాత, మిముఁ గొల్చి భజించినవాడెపో నిరా
      తంకమనస్కు డెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ!  

భ (4)    

    * భండన భీముఁ డార్తజన బాంధవుఁ డుజ్జ్వల బాణ తూణ కో
      దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి, రామ మూర్తికిన్
      రెండవ సాటి దైవ మిఁక లేఁడనుచున్, గడగట్టి, భేరికా
      దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ, మత్తవే
      దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణా పయోనిధీ!  

    * భానుడు తూర్పునందుఁ గనుపట్టినఁ బావక చంద్ర తేజముల్
      హీనతఁ జెందినట్లు, జగదేక విరాజితమైన నీ పద
      ధ్యానము సేయుచున్నఁ బరదైవ మరీచు లడంగకుండునే
      దానవగర్వనిర్దళన! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * భూప లలామ! రామ! రఘుపుంగవ! రామ! త్రిలోకరాజ్య సం
      స్థాపన! రామ! మోక్షఫలదాయక! రామ! మదీయ పాపముల్
      పాపగదయ్య! రామ! నినుఁ బ్రస్తుతి చేసెదనయ్య! రామ! సీ
      తాపతి! రామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * భ్రమరము కీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణోపకారియై
      భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి, భవాది దుఃఖసం
      తమస మెడల్చి భక్తిసహితంబుగ జీవుని విశ్వరూప త
      త్త్వమున ధరించు టేమరుదు? దాశరథీ! కరుణాపయోనిధీ!  

మ (5)    

    * మనమున నూహపోహణలు మర్వక మున్నె, కఫాది రోగముల్
      దనువున నంటి మేనిబిగి తప్పక మున్నె, నరుండు మోక్షసా
      ధన మొనరింపగావలయుఁ, దత్త్వవిచారము మానియుండుటల్
      దనువునకున్ విరోధమది, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * మసగొని రేగుబండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
      ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యొ నా
      రసనకు బూతవృత్తిసుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
      రసములు చిల్కఁ బద్యముఖరంగమునందు నటింపవయ్య! సం
      తసమును జెంది భద్రగిరి దాశరథీ! కరుణపయోనిధీ!  

    * మామక పాతకవ్రజము మాన్పనగణ్యము, చిత్రగుప్తులే
      మేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
      స్తోమ మొనర్చుటేమొ? వినజొప్పడ దింతకు మున్నె దీనచిం
      తామణి, యెట్లుగాచెదవొ? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * ముదమున కాటపట్టు, భవమోహ మదద్విరదాంకుశంబు, సం
      పదల కొటారు, కోరికల పంట, పరంబున కాది, వైరుల
      న్నదన జయించు త్రోవ, విపదబ్ధికి నావ గదా సదా భవ
      త్సదమల నామ సంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * ముప్పునఁ గాలకింకరులు ముంగిట నిల్చినవేళ, రోగముల్
      గొప్పరమైనచో కఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
      గప్పినవేళ, మీ స్మరణ గల్గునొ, గల్గదొ నాటికిప్పుడే
      తప్పక చేతు మీ భజన దాశరథీ! కరుణాపయోనిధీ!  

య (0)    

ర (5)    

    * రంగ దరాతిభంగ, ఖగరాజ తురంగ, విపత్పరంపరో
      త్తుంగ తమః పతంగ, పరితోషితరంగ, దయాంతరంగ, స
      త్సంగ,ధరాత్మజా హృదయ సారసభృంగ, నిశాచరాబ్జ మా
      తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * రామ హరే కకుత్థ్సకులరామ హరే రఘురామ రామ శ్రీ
      రామ హరే యటంచు మది రంజిల భేకగళంబులీల నీ
      నామము సంస్మరించిన జనంబు భవంబెడబాపి తత్పరం
      ధామనివాసులౌదురట, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * రాముడు, ఘోరపాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికా
      రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో
      ద్దాముడు, రాముడే పరమదైవము మాకని మీ యడుంగుఁ గెం
      దామరలే భజించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * రామ, విశాల విక్రమ పరాజిత భార్గవరామ, సద్గుణ
      స్తోమ, పరాంగనా విముఖ సువ్రతకామ, వినీల నీరద
      శ్యామ, కకుత్స్థ వంశ కలశాంబుధి సోమ, సురారిదోర్బలో
      ద్దామ విరామ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * 'రా' కలుషంబు లెల్ల బయలంబడఁ ద్రోచిన, 'మా' కవాటమై
      దీకొని బ్రోచు నిక్కమది ధీయుతులైనఁ దదీయ వర్ణముల్
      గైకొని భక్తిచే నుడువఁ గానరుగాక విపత్పరంపరల్
      దాకొనునే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ!  

ల (0)    

వ (6)    

    * వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
      వినికికిఁ జిక్కెఁ జిల్వ, కనువేదురుఁ జెందెను లేళ్ళు, తావిలో
      మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూటిని గెల్వ నైదు సా
      ధనముల నీవె కావదగు! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * వలదు పరాకు భక్తజనవత్సల! నీ చరితమ్ము వమ్ము గా
      వలదు పరాకు, నీ బిరుదు వజ్రమువంటిది కావ కూరకే
      వలదు పరాకు, నా దురితవార్ధికిఁ దెప్పవుగా మనంబులో
      దలతుమెకా నిరంతరము, దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * వారిచరావతారమున వారిధిలోఁ జొరఁబారి క్రోధవి
      స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిన్
      జేరి, వధించి, వేదముల చిక్కెడలించి, విరించికిన్ మహో
      దారత నిచ్చితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * వారిజపత్ర మందిడిన వారి విధంబున వర్తనీయమం
      దారయ రొంపిలోన దనువంటని కుమ్మరిపుర్వు రీతి సం
      సారమునన్ మెలంగుచు విచారగుడై పరమొందుఁ గాదె స
      త్కార మెరింగి మానవుడు దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * వాసవరాజ్య భోగ సుఖవార్ధిని దేలు బ్రభుత్వ మబ్బినా
      యాసకు మేర లేదు, కనకాద్రి సమాన ధనంబు గూర్చినం
      గాసును వెంట రాదు, కని కానక చేసిన బుణ్యపాపముల్
      వీసర బోవనీవు, బదివేలకుఁ జాలు భవంబు లొల్ల, నీ
      దాసునిగాగ నేలుకొను! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * విన్నప మాలకించు రఘువీర! నహి ప్రతిలోకమందు నా
      కన్న దురాత్ముడుం బరమ కారుణికోత్తమ! వేల్పులందు నీ
      కన్న మహాత్ముడుం బతితకల్మషదూరుడు లేడు నాకు, వి
      ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ! కరుణాపయోనిధీ!  

శ (6)    

    * శ్రీ రఘురామ చారుతులసీదళదామ శమక్షమాది శృం
      గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
      ర్వార కబంధరాక్షస విరామ జగజ్జనకల్మషార్ణవో
      త్తారక నామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * శ్రీద, సనందనాది మునిసేవిత పాద, దిగంతకీర్తి సం
      పాద, సమస్త భూతపరిపాల వినోద, విషాదవల్లికా
      చ్ఛేద, ధరాధినాథకుల సింధుసుధామయపాద, నృత్యగీ
      తాది వినోద, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * శ్రీయుత జానకీరమణ! చిన్మయరూప! రమేశ! రామ! నా
      రాయణ! పాహిపాహి యని ప్రస్తుతిఁ జేసితి, నా మనంబునం
      బాయక కిల్బిషవ్రజ విపాటన మందగఁ జేసి సత్కళా
      దాయి ఫలంబు నా కిడవె! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * శ్రీరఘువంశతోయధికి శీతమయూఖుడవైన నీ పవి
      త్రోరుపదాబ్జముల్ వికసితోత్పలచంపకవృత్త మాధురీ
      పూరిత వాక్ప్రసూనములఁ బూజ లొనర్చెదఁ జిత్తగింపుమీ,
      తారకనామ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * శ్రీరమ సీతగాగ, నిజసేవకబృందము వీరవైష్ణవా
      చార జనంబుగాగ, విరజానది గౌతమిగా, వికుంఠము
      న్నారయ భద్రశైలశిఖరాగ్రముగాగ, వసించు చేతనో
      ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * శ్రీరమణీయహార, యతసీకుసుమాభశరీర, భక్తమం
      దార, వికారదూర, పరతత్త్వవిహార, త్రిలోకచేతనో
      ద్ధార, దురంత పాతకవితాన విదూర, ఖరాది దైత్యకాం
      తార కుఠార, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ  

ష (0)    

స (7)    

    * సంకరదుర్గమై, దురితసంకులమైన జగంబుఁ జూచి స
      ర్వంకషలీల నుత్తమతురంగము నెక్కి కరాసిఁ బూని వీ
      రాంకవిలాస మొప్పఁ గలికాకృతి సజ్జనకోటికిన్ నిరా
      తంక మొనర్చితీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సరసుని మానసంబు సరసజ్ఞు డెరుంగును, ముష్కరాధముం
      డెరిగి గ్రహించువాడె? కొల నేకనివాసము గాగ దర్దురం
      బరయగ నేర్చునెట్లు వికచాబ్జ మరందరసైక సౌరభో
      త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సలలిత రామనామ జపసార మెరుంగను గాశికాపురీ
      నిలయుడఁ గాను, మీ చరణ నీరజ రేణు మహాప్రభావముం
      దెలియ నహల్యఁ గాను, జగతీవర! నీదగు సత్యవాక్యముం
      దలపగ రావణాసురుని తమ్ముడఁ గాను, భవద్విలాసమున్
      తలచి నుతింప నా తరమె? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సిరిగలనాఁడు, మైమరచి చిక్కిననాఁడు, దలంచి పుణ్యముల్
      పొరిఁబొరి చేయనైతి నని పొక్కినఁ గల్గునె? గాలి చిచ్చు పైఁ
      గెరలిన వేళఁ, దప్పిగొని కీడ్పడు వేళఁ, జలంబుఁ గోరి త
      త్తరమునఁ ద్రవ్వినం గలదె? దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సిరులిడ సీత, పీడ లెగఁజిమ్ముటకున్ హనుమంతు, డార్తి పోఁ
      దరుమ సుమిత్రసూతి, దురితంబులు మానుప రామనామమున్
      గరుణ దలిర్ప, మానవులఁ గావగఁ బన్నిన వజ్రపంజరో
      త్కరముగదా భవన్మహిమ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సురలు నుతింపగాఁ ద్రిపురసుందరులన్ వరియింప బుద్ధ రూ
      పరయగఁ దాల్చితీవు, త్రిపురాసురకోటి దహించునప్పు డా
      హరునకుఁ దోడుగా వరశరాసన బాణ ముఖోగ్ర సాధనో
      త్కర మొనరించి తీవె కద! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * సూరిజనుల్, దయాపరులు, సూనృతవాదు, లలుబ్ధమానవుల్,
      వీరపతివ్రతాంగనలు, విప్రులు, గోవులు, వేదముల్ మహీ
      భారముఁ దాల్పగా, జనులు పావనమైన పరోపకార స
      త్కార మెరుంగలే రకట! దాశరథీ! కరుణాపయోనిధీ!  

హ (4)    

    * హరిపద భక్తి నింద్రియజయాన్వితు డుత్తము డింద్రియమ్ములన్
      మరుగక నిల్పనూదినను మధ్యము డింద్రియ పారవశ్యుడై
      పరగినచో నికృష్టుడని బల్కగ, దుర్మతినైన నన్ను నా
      దరమున నెట్లు కాచెదవొ! దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * హరునకు నవ్విభీషణున కద్రిజకున్ దిరుమంత్రరాజమై
      కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై
      పరిగిన యట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
      తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ 

    * హల కులిశాంకుశ ధ్వజ శరాసన శంఖ రథాంగ కల్పకో
      జ్జ్వల జలజాతరేఖలను సాంకములై కనుపట్టుచున్న మీ
      కలిత పదాంబుజద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
      తలపున జేర్చి కావగదె దాశరథీ! కరుణాపయోనిధీ!  

    * హలికునకున్ హలాగ్రమున నర్థము చేకురుభంగి, దప్పిచే
      నలమటఁ జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు, దు
      ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
      దలపు ఘటింపజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ!